అసాధ్యమైన రైతు డిమాండ్లతో సర్కారుకు ఇబ్బందులు

ఉత్తరాదిన రైతుల ఉద్యమం రెండో రోజుకు చేరుకుంది. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ రైతులు చేపట్టిన కార్యక్రమాల్లో నిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. గతంలో ప్రభుత్వం అమలు జరిపిన హామీలను గుర్తుచేసినప్పటికీ మంత్రుల మాటలు వినేందుకు అన్నదాతలు సిద్ధపడటం లేదు. దానితో వారికి నచ్చజెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, రైతుల రాకతో ఢిల్లీలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి..

రైతుల డిమాండ్లేమిటి…

గత నిరసనల సందర్భంగా రైతులు చాలా డిమాండ్లే పెట్టారు. వాటిల్లో చాలా వరకు మోదీ ప్రభుత్వం నెరవేర్చింది. ఐనా ఇప్పుడు కొన్ని డిమాండ్లను మార్చిన రైతు సంఘాలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. అన్ని పంటలకు ఇచ్చే మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని వారు కోరుతున్నారు. సమగ్ర రుణ మాఫీ పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2020-21లో నిరసనల సందర్భంగా చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలని కోరుతున్నారు. అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలి. అన్ని పంటలకు బీమా విధానాన్ని అమలు చేయాలి. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదన్నది వారి ప్రధాన డిమాండ్ . పంటపొలాలకు, రైతుల ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని వాళ్లు కోరుతున్నారు..

మద్దతు ధర చట్టం అసాధ్యం…

మద్దతు ధర విషయంలో స్వామినాధన్ కమిటీ సూచనలు సహేతుకంగా లేవన్న వాదన వినిపిస్తోంది.రైతుల పెట్టిన ఖర్చుకు 150 శాతంతో పాటు, కూలి, భూమి విలువలో కొంత భాగాన్ని చేర్చి,సగటు కట్టి.. మద్దతు ధర ఇవ్వాలని స్వామినాధన్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే అదిచాలా ఎక్కువ అవుతుందని,అంత సొమ్ము ఇస్తే నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతాయని వ్యవసాయ రంగ నిపుణులతో పాటు ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. అలాంటి డిమాండ్లకు తలొగ్గదని కూడా వారు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. ఎంఎస్పీకి చట్టబద్దతను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన వివరణ కూడా సహేతుకంగానే ఉంది. 2020లో వ్యవసాయోత్సత్తుల విలువ రూ.40 లక్షల కోట్లు ఉంటే, వాటి మార్కెట్ విలువ కేవలం రూ.10 లక్షల కోట్లు ఉందని అధికారులు గుర్తుచేస్తున్నారు. వ్యవసాయోత్పత్తులను రూ. 40 నుంచి రూ. 45 లక్షల కోట్లకు కొనుగోలు చేస్తే… మిగతా పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడ నుంచి తీసుకురావాలో రైతుల డిమాండ్లకు మద్దతిచ్చేవారే చెప్పాలని ప్రభుత్వం కోరుతోంది. రైతుల మిగతా డిమాండ్లు అయిన కేసుల ఎత్తివేత, రుణ మాఫీ లాంటివాటిని పరిశీలిస్తామని చెబుతోంది. ఇప్పటికే చాలా వరకు కేసులు ఎత్తివేశామని, మిగతా వారిని కూడా పరిశీలించి ఉపసంహరిస్తామని వెల్లడించింది…

పేలులు ఏరుకుంటున్న కాంగ్రెస్

దేశం తగులబడుతుంటే అందులో పేలాలు వేయించుకుని ఏరుకునే బాపతుగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే పని చేస్తోంది. రైతులను కేంద్రప్రభుత్వం చర్చలకు పిలిచిన నేపథ్యంలో ఆ పని జరగకుండా వారిని రెచ్చగొట్టేందుకు విపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. రైతుల పక్షం వహిస్తున్నట్లు నాటకం ఆడటంతో పాటు ఈ నెల 16న నిర్వహించే భారత్ బంద్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది…