ఏపీలో ఎన్నికల రణరంగం మొదలైంది. అభ్యర్థుల ఖరారు చేస్తూనే.. ఇంచుమించు పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఐదు దఫాలుగా అభ్యర్థులను ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. మిగిలిన కొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ-జనసేన ఉన్నాయి. కానీ రెండు పార్టీల మధ్య అనేక స్థానాల్లో పీట ముడి పడుతున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంట్లో జనసేనకు రెండు స్థానాలేనా ?
రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసిందని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 25 లోక్‌సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తేలకపోయినా.. ఇప్పటికి 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లను ఆ పార్టీకి కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మిగిలిన సీట్లలో అభ్యర్థులపై పరిశీలన కొనసాగుతోంది. విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేశ్, కంది చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. అరకు స్థానంపై కసరత్తు మొదలు కాలేదు. రాజమండ్రి నుంచి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు పేరు ముందంజలో ఉంది. ఆయన కాని పక్షంలో బొడ్డు వెంకటరమణ, గన్ని కృష్ణ, శిష్ట్లా లోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. అంటే నిరకంగా జనసేనకు రెండు లోక్ సభ సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
రాయలసీమలో జనసేనకు పోటీ చేసే చాన్స్ లేనట్లే !
రాయలసీమలో జనసేనకు ఒక్క సీటు కూడా ఉంటుందా ఉండదా అన్నదానిపై స్పష్టత లేదు. టీడీపీ అభ్యర్థుల పేర్లే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. గుంటూరుకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైందని అంటున్నారు. బాపట్ల స్థానం కోసం అరడజను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. హరిప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, పనబాక లక్ష్మి, పాలపర్తి మనోజ్‌కుమార్, ఎంఎస్ రాజు పోటీలో ఉన్నారు. మరి కొన్ని పేర్లను కూడా ఆ పార్టీ నాయకత్వం క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపింది. ఒంగోలు, నెల్లూరు అభ్యర్థులపై కసరత్తును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు.ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉన్నందున వీటి విషయం తర్వాత ఆలోచించాలని నిర్ణయించారు. చిత్తూరు స్థానానికి తలారి ఆదిత్య, యశ్వంత్, హరిప్రసాద్, సినీనటుడు సప్తగిరి, కోనేరు ఆదిమూలం పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసినా.. తాజాగా పూల నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. క
సీమలో ఒక్క లోక్ సభ సీటు కోసం జనసేన పట్టు
కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి.. నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జగన్‌ను ఎలాగైనా ఓడించాలని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో ఉన్న టీడీపీ-జనసేన.. పొత్తులో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకే తమకు ఓ సీటు కేటాయించాలని కోరుతున్నారు. అయితే జనసేన విజ్ఞప్తిని పట్టించుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.