రాష్ట్రంలో అత్యధికంగా రెడ్డి సామాజికవర్గ ఓటర్లు ఉన్న నియోజకవర్గం పులివెందుల. అక్కడ అరవై శాతం వరకూ రెడ్లే ఉంటారని అంచనా. ఆ తర్వాత గోదావరి జిల్లాల్లోని అనపర్తి నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం రెడ్లు ఉంటారు. అయితే టీడీపీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి అనపర్తి కంచుకోటగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది.
రెడ్లకు అనధికార రిజర్వేషన్ అనపర్తి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా వారు రెడ్డి సామాజికవర్గం వారు మాత్రమే ఇక్కడ విజేతలుగా నిలుస్తూ వస్తున్నసంప్రదాయమే నడుస్తుంది. 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతలదే హవా నడుస్తోంది. సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనపర్తి రాజకీయంలో ఐదేళ్లుగా అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. టీడీపీ ఇంచార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య అవినీతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయ్. పెదపూడి,బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాలు పరిధిలోని ఓటర్లు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు.
పలుమార్లు గెలిచిన టీడీపీ
1983 నుంచి పరిశీలిస్తే నాటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించారు. 1985 లో కూడా ఆయనే గెలిచారు. 1989, 1994 లో కాంగ్రెస్ ఈ స్థానం దక్కించుకుంది. నిజాయితీ పరుడుగా మంచి పేరున్న తేతలి రామారెడ్డి వరుసగా విజయం సాధించి టిడిపికి షాక్ ఇచ్చారు. ఆ తరువాత 1999 లో నల్లమిల్లి మూలారెడ్డి తిరిగి గెలిచి నిలిచారు. అయితే 2004 లో మూలా రెడ్డి ని ఓడించారుతేతలి రామారెడ్డి. 2009 లో నల్లమిల్లి శేషారెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించగా 2014 లో మూలా రెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టి టిడిపికి తిరిగి ప్రాణం పోసారు. 2009 ఎన్నికలను విశ్లేషిస్తే విజేతగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి 61194 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి చిరంజీవి ప్రజా రాజ్యం అభ్యర్థి డిఆర్కే త్రీడి 34749 ఓట్లు సాధించి రెండో స్థానంలో, టిడిపి అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి 33500 ఓట్లతో మూడోస్థానం పొందారు.
గత ఎన్నికల్లో వైసీపీకి రికార్డు మెజార్టీ
వయోభారంతో వున్న మూలారెడ్డి స్థానంలో టిడిపి మార్పు చేసి 2014 లో ఆయన టికెట్ స్థానంలో ఆయన కుమారుడు రామకృష్ణా రెడ్డి కి అవకాశం కల్పించి విజయం సాధించింది. రామకృష్ణ రెడ్డి గెలిచినా ఆయన ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి నడుమ కేవలం 1373 ఓట్ల తేడా మాత్రమే కావడం గమనార్హం. రామకృష్ణ రెడ్డి కి 83,398 ఓట్లు పోల్ అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి 82025 ఓట్లు పోల్ కావడం విశేషం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డికి సానుభూతి బాగా పని చేసంది. 55వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి కూడా పరిస్థితి అటూ ఇటూగా అంతే ఉంటుందని అంచనా వేస్తున్నారు.