టీడీపీ తరపున బీజేపీతో పొత్తుల కోసం నాదెండ్ల రాయబారం – ఆ చర్చల్లో ఏం జరిగింది ?

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారం టీడీపీ, జనసేనల్లో కలకలం రేపుతోంది. బీజేపీని కలుపుకుని పోకపోతే కష్టమన్న వాదన వినిపిస్తూండటంతో ఆ పార్టీ హైకమాండ్ తో మాట్లాడాలని భావిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ఇంత వరకూ నేరుగా తమ ప్రతిపాదనలు పంపలేదు. దీంతో హైకమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో ఏదో ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

నాదెండ్ల .. టీడీపీ తరపున వచ్చారా ?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహరచనపై చర్చించడానికి వచ్చిన శివప్రకాష్ జీతో .. జనసేన నేత నాదెండ్ల మనోహర్ వచ్చి చర్చలు జరిపారు. అయితే ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు. అంతకు ముందే.. పొత్తుల కోసం టీడీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని బీజేపీ తేల్చి చెప్పేసింది. ఈ కారణంగా తాము పొత్తుకు రెడీగా ఉన్నామన్న సందేశాన్ని టీడీపీ అగ్రనాయకత్వం నాదెండ్ల ద్వారా పంపిందని చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని టీడీపీ చెప్పాలి కానీ.. మిత్రపక్షం చెబితే ఎలా అన్న వాదన హైకమాండ్ ప్రతినిధుల నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్న శివప్రకాష్ జీ

పార్టీ నేతలందరూ టీడీపీతో పొత్తుపై తమ అభిప్రాయాలను.. సీల్డ్ కవర్ లో ఇవ్వాలని శివప్రకాష్ జీ కోరారు. ఆ మేరుక నేతలంతా రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను రాసి కవర్ లో పెట్టి ఇచ్చారు. వాటిని క్రోడీకరించి పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏపీ లో పార్టీ పొత్తులు కావాలా వద్దా అన్నదానిపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ ఒంటరిగా ఉండటం వల్లే బలపడిందని…. ఏపీకి కూడా అలాంటి అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఒంటరి పోటీకి సన్నాహాలు కూడా !

పొత్తులపై ఎక్కువ ఆలోచించవద్దని ఒంటరిగా పోటీ కి కూడా సిద్ధం కావాలని.. బీజేపీ నేతలకు హైకమాండ్ స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో చాలా మంది నేతలు గ్రౌండ్ లెవల్లో పని చేసుకోవడం ప్రారంభించారు. హిందూపురం వంటి చోట్ల.. ప్రజా పోరాటాలు కూడా నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో పొత్తుల అంశంపై వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.