నర్సీపట్నంలో అయ్యన్నకు రిటైర్మెంటేనా ? – అభ్యర్థిని మార్చి వైసీపీ మళ్లీ గోల్ కొడుతుందా ?

తెలుగుదేశం సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడుకి నర్సీపట్నం నియోజకవర్గంలో మరోసారి పట్టు సాదించడం కష్టంగా మారుతోంది. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూండటంతో ఆ కుటుంబానికి ఉన్న క్యాడర్ రెండుగా చీలిపోయింది. అయ్యన్న బలం తగ్గించడానికి అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకొని ఆయన కుటుంబానికి డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ. ఆ ప్రభావం నుంచి అయ్యన్న ఇంకా కోలుకోలేదన్న వాదన వినిపిస్తోంది

అయ్యన్న వయసు ఆటంకం

అయ్యన్న చాలాసీనియర్. ఆయన వయసు కూడా సహకరించడంలేదు. ఓడిపోయినప్పటి నుంచే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల్లో అయ్యన్న కుమారుడు విజయ్ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో చూసుకొని.. అక్కడి నేతలను సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత వరకు ఫలితాలను ఇస్తుందనేది వారికే అర్థం కావడంలేదు.

అందరికీ అందుబాటులో ఉండే ఉమాశంకర్ గణేష్

సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ సైతం జనంలోనే ఉంటారు. రోడ్డు విస్తరణ అనేది ఎన్నికల హామీ.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గణేష్ కు నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ అనేది జీవన్మరణ సమస్యగా మారిందని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. నర్సీపట్నం మెయిన్ రోడ్డు 80 అడుగులు విస్తరించాలనేది ప్రతిపాదన ఉంది. దీన్ని 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను తెరమీదకు తీసుకు వచ్చారు గణేష్. కొన్ని వ్యవహారాలు రివర్స్ అవడంతో ఈ సారి ఎమ్మెల్యే గణేష్‌కు టిక్కెట్ లేదన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు.

పోటీ హోరాహోరీ

గతంలో అయ్యన్నను ఓడించిది ఈమె. అదే వ్యూహం వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఈ పరిణామాలు చూసిన తరువాత అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా టికెట్ తనకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతునన్నారు. ఎలా చూసినా అయ్యన్నపాత్రుడికి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన మద్దతు కూడా అంతంతమాత్రంగానే ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు