ప్రజా నాయకులకు బీజేపీ పట్టం..

రాజకీయ నాయకుడంటే జనంలో ఉండాలి. జనంతో మమేకమై పనిచేయాలి. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోవాలి. అప్పుడే వాళ్లు ప్రజల మనిషి అనిపించుకుంటారు. అధిష్టానం మద్దతు కూడా పొందుతారు..

మొదటి సారి ఎమ్మెల్యేకే సీఎం పదవి….

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాజస్థాన్ రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది సీనియర్లను కాదని, మాజీ సీఎం వసుంధరా రాజేను కూడా పక్కన పెట్టి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. పార్టీ మీటింగులో ఎక్కడో వెనుక కూర్చున్న భజన్ లాల్ శర్మ తన పేరును ప్రకటించిన వెంటనే తొలుత ఆశ్చర్యానికి, తర్వాత ఉద్వేగానికి లోనయ్యారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలోనే ఆయన పేరును ప్రకటించినప్పడు పార్టీలో ప్రతీ ఒక్కరూ ఆనందానికి లోనయ్యారు. బీజేపీ కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తికి అవకాశం వచ్చిందని భావించారు. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా భావించే భజన్ లాల్ శర్మ… తొలుత బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో పనిచేసే వారు. తర్వాత బీజేపీలో చేరి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. భరత్ పూర్ ప్రాంతానికి చెందిన భజన్ లాల్ శర్మను… విజయావకాశాలు మెరుగ్గా ఉండేందుకే సంగనేర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అగ్రకులం నాయకుడైనప్పటికీ ఆయన ఎక్కడా కులభావాన్ని ప్రదర్శించిన సందర్భము లేదు. నిత్యం లో ప్రొఫైల్ లోనే రాజకీయాలు చేశారన్న పేరు ఉంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ ఆస్తి కోటిన్నర, అందులో 43 లక్షల రూపాయల చరాస్తి కాగా, కోటికి పైగా స్థిరాస్తున్నాయి. ఇతర రాజకీయ నాయకులతో పోల్చితే ఆయన సంపద వెయ్యి రెట్లు తక్కువనే చెప్పాలి.

జనంలో తిరిగే రాజకుమారి దియాకుమారి…

రాజస్థాన్ కు ఇద్దరు డిప్యూటీ సీఎంలు వచ్చారు అందులో ఒకరు దియాకుమారి కాగా, మరోకరు ప్రేమ చంద్ బైరవ. దియాకుమారి రాజకుటుంబానికి చెందిన మహిళ. జైపూర్ మహారాజు మనవరాలు ఆమె, నిత్యం జనంలో తిరుగుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నందున ఆమెకు డాటర్ ఆఫ్ జైపూర్ అని కూడా పెరుంది. ఎక్కడా రాజకుటుంబ షోకులు కనిపించకుండా సామాన్యంగా ఉండటంతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన 52 ఏళ్ల దియాకుమారి.. అంతకముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు విద్యానగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు పర్యావరణం, విద్య. మహిళల సాధికారత కోసం ఆమె నిత్యం పనిచేస్తుంటారు.

సామాజిక సమతౌల్యాన్ని పాటించిన బీజేపీ

సీఎం, డిప్యూటీ సీఎంల ఎంపికలో బీజేపీ పెద్దలు సామాజిక వర్గాల లెక్కలను ఖచితంగా పాటించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మకు ముఖ్యమంత్రి పదవి ఇస్తూనే .. రాజపుత్ వర్గానికి చెందిన దియా కుమారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ చంద్ బైరవ మరో డిప్యూటీ సీఎం అయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఇదే విన్నింగ్ ఫార్ములా కావచ్చు.