గద్వాలలో గెలుపు బాధ్యత తీసుకున్న డీకే అరుణ – కమలం వికసిస్తుందా !?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో గద్వాల కూడా ఒకటి. బీజేపీ కీలక నేత డీకే అరుణ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒక వేళ ఆమె పోటీ చేయకోపయినా.. ఆమె చెప్పిన వారికే టిక్కెట్ ఇస్తారు. గెలుపు బాధ్యతలు ఆమె తీసుకుంటారు. అందుకే బీజేపీ ఖాతాలో పడే పడే సీట్లలో గద్వాల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

గద్వాలలో డీకే అరుణ కుటుంబానికి పట్టు

గద్వాలలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు. డీకే కుటుంబ సభ్యులే అక్కడ 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణ మంత్రులుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి గెలిచారు.
గడచిన మూడు ఎన్నికల్లో వీరిద్దరు తలబడితే రెండుసార్లు డీకే అరుణ విజయం సాధించగా కృష్ణమోహన్‌ రెడ్డి ఒకసారి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో డీకే అరుణ బీజేపీలో చేరారు. 2019లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

గద్వాలలో బీజేపీని బలోపేతం చేసిన డీకే అరుణ

ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా అరుణకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌ వీడిన తర్వాత గద్వాలలో బీజేపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆమె నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే గద్వాల నియోజకవర్గంపై ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత .. అంతకు ముందు బీజేపీ పాలనే బాగుందన్న అబిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత – వలస నేతపై ఆధారపడిన కాంగ్రెస్

మరోసారి కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూపు తగదాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయి. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు తారాస్దాయికి చేరటంతో ఇటీవలే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు టిక్కెట్ లభించింది. ఎలా చూసినా వీరంతా ఒకే ఓటు బ్యాంక్ ను రెడు పార్టీలు పంచుకోవాల్సి వస్తుంది. జిల్లా ప్రజల్లో ప్రత్యేకంగా ఆదరణ పొందిన డీకే అరుణ ఈ సారి తాను లేదా.. తాను నిలబెట్టేబోయే అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు.