వంటగదిలో పప్పులు ఉప్పులు అన్నింటికీ ప్లాస్టిక్ డబ్బాలే వాడుతున్నారా!

అందంగా కనిపిస్తాయి, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చనే ఆలోచనతో ఇల్లంతా ప్లాస్టిక్ తో నింపేస్తున్నారా? పిల్లలకు స్కూల్ బాక్సులకు కూడా ప్లాస్టిక్కే వినియోగిస్తున్నారా? స్టైలిష్ గా కనిపిస్తుంది అనుకుంటున్నారు కానీ ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో తెలుసా…

ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ప్లాస్టిక్‌ బాక్సులు, డబ్బాల వాడకం పెరిగింది. ముఖ్యంగా వంటగదిలో పప్పు దినుసులు, పిండి, రవ్వలు మొదలు చిరు తిండ్లు పెట్టుకోవాలన్నా, మిగిలిన కూరల్ని ఫ్రిజ్‌లో ఉంచుకోవాలన్నా, పిల్లలకు బాక్సులు పెట్టి స్కూలుకు పంపించాలన్నా అంతా ఎక్కువగా వీటినే వాడుతున్నారు. తక్కువ ధరల్లో, రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో వీటిని కొనుక్కునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అవి ఎంత నాణ్యమైనవైనా సరే వీటిని వాడటం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్లాస్టిక్ డబ్బాలు ఎందుకు వినియోగించరాదు
ప్లాస్టిక్‌ డబ్బాల తయారీలో వాడే బీపీఏ, బీపీఎఫ్‌లకు పిల్లల్లో ఊబకాయం సమస్యలకు మధ్య సంబంధం ఉన్నట్లు 2019లో న్యూయార్క్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ బాక్సుల్లోకి వేడి వేడిగా వండిన పదార్థాలను పెట్టడం చాలా ప్రమాదకరం. అలాగే మైక్రోవేవ్‌ల్లో పదార్థాలను వేడి చేయడానికి ప్లాస్టిక్‌ గిన్నెలను వాడడమూ అంతే. వీటిలో ఉండే ప్రమాదకర రసాయనాలు వేడి వేడి ఆహార పదార్థాలతో రియాక్ట్‌ అయి దాన్ని అనారోగ్యకరంగా మార్చేస్తాయి. అలాగే కొన్ని ప్లాస్టిక్‌ డబ్బాలను రీయూజ్డ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిని ప్రోసెసింగ్‌ చేసే క్రమంలో వీటిలో పెద్ద ఎత్తున రసాయనాలను వాడతారు. ఇలాంటి వాటిలో ఆహారాలు ఉంచడం వల్ల వాటిలోకి ప్రమాదకర రసాయనాలు వచ్చి చేరే అవకాశాలు ఉంటాయి. అలాగే బాగా పాతబడిపోయి, గీతలు పడిపోయి ఉన్న డబ్బాలను వాడకపోవడమే మంచిది. కొంతలో కొంత ఫుడ్‌ సేఫ్‌ ప్లాస్టిక్‌ని వాడటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి. కానీ వీటిలోనైనా వేడి పదార్థాలను పెట్టకూడదు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో తయారు చేసే డబ్బాలు, ప్లేట్లను ఒకసారికంటే ఎక్కువ వాడకూడదు. అందువల్ల చాలా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి

ప్లాస్టిక్ బదులు ఇవి వాడండి
ప్లాస్టిక్‌ డబ్బాలు, బాక్సులకు బదులుగా స్టీలు, గాజు, ఇత్తడి లాంటి లోహపు డబ్బాలు, క్యాన్లను వాడుకోవడం మంచిది. ఇవి తొందరగా అన్ని ఆహార పదార్థాలతో రియాక్ట్‌ కావు. అలాగే వీటి నుంచి విషపూరితమైన రసాయనాలూ విడుదల కావు. అందువల్ల ప్లాస్టిక్‌ డబ్బాల స్థానంలో ఈ లోహాలను వాడుకోవడం ఉత్తమం. మైక్రోవేవ్‌లో వాడుకోవడానికి మైక్రోవేవ్‌ సేఫ్‌ గాజు పాత్రలు ఉంటాయి. ప్లాస్టిక్‌ వాటితో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి.