ప్రధాని మోదీ నేతృత్వ బీజేపీ సరికొత్త ప్రయోగాలకు తెరతీస్తోంది. ప్రత్యర్థుల కంటే పది అడుగుల ముందు ఉండాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఓడిన చోట గెలిచేందుకు, గెలిచిన సీట్లను మరింత పదిలం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించే లోపే పది అడుగులు ముందుకు వెళ్లిపోతోంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కొత్త వ్యూహం
ఎన్నికల షెడ్యూల్ ఇంకా రానే లేదు. ఎన్నికలకు కనీసం మూడు నెలల టైమ్ ఉంది. అంతలోనే బీజేపీ మాస్టర్ స్ట్రోక్ కొట్టేసింది. ఏడాది ఆఖరుకు ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమలుకు నెలన్నర ముందే బీజేపీ ఈ పని చేసి చూపించింది. కాంగ్రెస్ రేపు ఆలోచించే అంశాలను బీజేపీ ఇవాళే అమలు చేస్తుందని నిరూపించింది. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 39 చోట్ల తొలి జాబితా విడుదలైంది. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 సీట్లుండగా తొలి జాబితాగా 21 మందిని ఎంపిక చేసింది. ఇదో ప్రయోగం మాత్రమే కాదని, ప్రచారానికి అత్యధిక సమయం కేటాయించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ పని వల్ల పార్టీలో అసంతృప్తిని త్వరగా చల్లార్చి .. ప్రచారం ఊపందుకునే నాటికి ఐకమత్యం సాధించే వీలుంటుందని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ప్రధాని మోదీ సూచనల మేరకే ఈ జాబితాను విడుదల చేశారు.
ఓడిన వారికి మరో ఛాన్స్
ఛత్తీడ్ గఢ్ లో ప్రకటించిన 21 మంది జాబితాలో గత ఎన్నికల్లో ఓడిన వారికే ఛాన్సిచ్చారు. ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోకుండా వారంతా అంకిత భావంతో పనిచేసి పార్టీ పటిష్ఠతకు కృషి చేశారని గుర్తించిన అధిష్టానం మరో అవకాశం ఇస్తే ఈ సారి గెలిచి చూపిస్తారని విశ్వసిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాతే అభ్యర్థులను అంచనా వేసి జాబితాను రూపొందించారు. ఇక మధ్యప్రదేశ్లో ప్రకటించిన 39 స్థానాల్లో 13 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. వాళ్లు ఇంతవరకు ఒక్క సారి కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇదీ కొత్త రక్తాన్ని ప్రోత్సహించేందుకేనని పార్టీ పెద్దలు అంటున్నారు. మధ్యప్రదేశ్ జాబితాలో ఆరుగురు మాజీ మంత్రులున్నారు. 39 మందిలో 21 మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. మాల్వా – నీమర్ ప్రాంతంలో 11 మంది, మహాకోశల్ లో 12, గ్వాలియర్ – ఛంబల్ లో ఆరుగురు, బుందేల్ ఖండ్ లో ఐదుగురు, సెంట్రల్ ఎంపీలో నలుగురు, వింధ్య ప్రాంతంలో ఒకరిని ప్రకటించారు. ఇక చత్తీస్ గఢ్ అభ్యర్థుల జాబితాలో 10 మంది ఎస్టీలున్నారు. ఒక ఎస్సీ అభ్యర్థిని ప్రకటించారు.
సీఎం భాగేల్ కు గట్టి పోటీ…
ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భాగేల్ ను ఓడించి తీరాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించి గట్టి కేండెట్ ను పెట్టింది. ఆయన బంధువే అయిన విజయ్ భాగేల్ ను భూపేష్ పై పోటీ పెట్టింది. ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా ఉన్న విజయ్ భాగేల్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపేష్ పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2008లో ఆయన్ను ఓడించిన రికార్డ్ ఉందనుకోండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దుర్గ్ నుంచి గెలిచిన విజయ్…. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే పటాన్ అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధిక ఓట్లు సాధించారు. దాని ఆధారంగానే ఇప్పుడాయనకు ఎమ్మల్యే టికెట్ ఇస్తున్నారు.