కర్ణాటక ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. పొరుగున ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూంటే ఏపీ బీజేపీ నేతల కూడా తమదైన బాధ్యతలు తీసుకున్నారు. కర్ణాటకపై స్పష్టమైన అవగాహన ఉన్న బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చారు. తెలుగు ఓటర్లు కీలకంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన బీజేపీ తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. బాగేపల్లి, శిడ్లగట్ట, చిక్ బళ్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు.
కర్ణాటకలో తెలుగు ఓటర్ల పాత్ర కీలకం
కర్ణాటక లో 224 అసెంబ్లి సీట్లుండగా ఏడు జిల్లాల్లోని దాదాపు 60 స్థానాల్లో తెలుగు మాట్లాడే ఓటర్లు 60 శాతానికి పైగా ఉన్నట్టు చెబుతున్నారు. కోలార్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో మెజార్టీ ఓటర్లు తెలుగు మూలాలు ఉన్న వారే. బెంగళూర్ రూరల్ జిల్లాలోని నాలుగు జిల్లాలో 65 శాతం, బెంగళూర్ అర్బన్ జిల్లాలోని 28 నియోజక వర్గాల్లో 49 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లున్నారు. రాయచూర్ జిల్లాలో ఏడు సీట్లలో 64 శాతం, బళ్లారిలో 9 అసెంబ్లి సీట్లలో 63 శాతం, చిక్ బల్లాపూర్ జిల్లాలో 5 సీట్లలో 49 శాతం కొప్పల్ జిల్లాలో 5 అసెంబ్లి సీట్లలో 43 శాతం తెలుగు ఓటర్లున్నారు. తెలంగాణలోని జహీరాబాద్‌కు పొరుగున ఉన్న బీదర్ నియోజక వర్గంలో ఉన్న ఓటర్లలో 20 శాతం మంది సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే. వీరి ఓట్లు కీలకం కానున్నాయి.
కోలార్, చిక్ బళ్లాపూర్, కోలార్, బళ్లారి వంటి చోట్ల విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు
కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో తెలుగు ఓటర్లు కీలకం అయ్యారు. వారందర్ని మళ్లీ బీజేపీ వైపు ఉంచేలా… మోదీ నాయకత్వంపై నమ్మకం కొనసాగించేలా ప్రచారం చేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో బృందం పని చేస్తోంది. రాయలసీమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఓ బృందం కర్ణాటక ఎన్నికల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ముందు ముందు మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రచార భేరీ మోగించాలనుకుంటున్నారు. డోర్ టు డోర్ ప్రచారమే కాకుండా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ వివిధ వర్గాలతో సమావేశం పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగిన లబ్దిని వివరిస్తున్నారు. మరోసారి బీజేపీని గెలిపించమని కోరుతున్నారు.
తెలంగాణ నేతలు కూడా రాక !
తెలంగాణకు పొరుగున ఉన్న గుల్బర్గా,రాయచూర్,కొప్పోల్,బీదర్ తో పాటు బెంగళూర్ అర్బన్ లో తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కర్ణాటకకు రానుంది . ఏపీ నేతలు… తెలంగాణ నేతలు కలిసి.. తెలుగు ఓటర్ల అభిమానం మళ్లీ బీజేపీకి దక్కేలా ప్రచారం చేయనున్నారు.