పవన్‌కు అందిన బీజేపీ రోడ్ మ్యాప్ – సునీల్ ధియోధర్ క్లారిటీ !

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ తరపున అన్ని రోడ్ మ్యాప్‌లు ఇచ్చేశామని ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పవన్ నే అడగాలని మీడియాకు సూచించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీతో బీజేపీ కలిసిందనేది తప్పుడు ప్రచారం

తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని, ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అన్నారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని, వైసీపి నేతలు సీబీఐని నిందించడం సరైన విధానం కాదన్నారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదన్నారు.

వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదన్న సునీల్ ధియోధర్

అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో పెట్టు కుంటున్నాడని.. ఏడు కొండల వాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగు పడలేదని చెప్పారు. సీఎం జగన్ నాశనం అయిపోతారని, 2024 ఎన్నికల తరువాత ఏపీలో వైసీపి పార్టీ ఉండదన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని సునీల్ దియోధర్ తెలిపారు. టీటీడీలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని, గత కొన్ని రోజుల ముందు టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

బీజేపీతో కలిసి వెళ్తారా లేదా అన్నది ఇక పవన్ చేతుల్లోనే !

గతంలో పవన్ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని.. బీజేపీ ఇంకా స్పందించలేదనే ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు పవన్ కు ఇవ్వాల్సిన రోడ్ మ్యాప్ లన్నీ ఇచ్చేశామని సునీల్ ధియోధర్ చెబుతున్నారు. అంటే ఇక నిర్ణయం పవన్ కల్యాణ్ చేతుల్లో ఉందన్నట్లే. మరి పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే సస్పెన్స్ గా మారింది. ఎన్నికల వేడి పెరుగుతున్నా ఆయన ఇంకా జనాల్లోకి రావట్లేదు.