కొన్ని బాండింగ్ లు అంతే. ఎవ్వరికీ అర్థం కావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అలాంటి బాండింగ్ కు పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఖాళీ సమయం దొరికితే చాలు కూర్చుని ముచ్చట్లు పెట్టేస్తుంటారు. పనిలో పనిగా సినిమాలు తీసుకుంటూ ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు 3 సినిమాలు వచ్చాయి. రెండు బ్లాక్ బస్టర్ అయితే ఒకటి డిజాస్టర్ అయ్యింది. అయితే వీరిద్దరి మధ్య బాండింగ్ కేవలం హీరో, డైరెక్టర్ వరకే ఆగిపోలేదు. పవన్ కల్యాణ్ ప్రతీ విషయంలో వెనుక నుంచి త్రివిక్రమ్ మద్దతు ఉంటూనే ఉంటుంది.
పవన్ వెనుకే మాంత్రికుడు
పవన్ కల్యాణ్ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటు సాయి ధరమ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయంలో త్రివిక్రమ్ చాలా మార్పులు చేర్పులు చేశాడట. త్రివిక్రమ్ ఇచ్చిన మార్పులు అన్ని పూర్తయిన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇది తమిళ సినిమా వినోదాయ శీతంకు రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి కూడా ప్రస్తుతం కథని ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. అయితే ఈ సినిమాను కూడా తాను డైరెక్ట్ చేయకుండా సుధీర్ వర్మకు అప్పగింటే పనిలో పడ్డాడు. గతంలో భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇలాగే చేశాడు తివిక్రమ్. దర్శకత్వం ఒక్కటీ వేరే వాళ్లకి ఇచ్చి… మిగతా మొత్తం తనే చూసుకుంటున్నాడు. అయితే ఇలాంటి ఫెసిలిటీ కేవలం పవన్ కల్యాణ్ సినిమాకు మాత్రమే.
పవన్ పవనే.. వ్యాపారం వ్యాపారమే
ఓవైపు మహేశ్ బాబుతో సినిమా. దర్శకుడిగా ఫుల్ బిజీ. మరోవైపు పవన్ కల్యాణ్ తో నాన్ స్టాప్ సినిమాలు. దర్శకత్వం తప్ప అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి. మరి త్రివిక్రమ్ కు ఏంటి బెనిఫిట్ అంటే. అక్కడే ఉంది అసలు మ్యాటరు. భీమ్లానాయక్ సినిమాకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్. అంతేకాకుండా పవన్-వైష్ణవ్ కాంబోలో వచ్చే సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫార్య్యూన్ ఫోర్ సినిమాస్ త్రివిక్రమ్ సొంత బ్యానరే. సో… పవన్ కల్యాణ్ తో బాండింగ్ కంటిన్యూ చేస్తూనే తనని తాను నిర్మాతగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు త్రివిక్రమ్.