వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. సీబీఐ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల చుట్టూ కేసు తిరుగుతోంది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన కోర్టుల్లో పిటిషన్లు వేస్త తాత్కలికంగా ఎలాగో ఊరట పొందుతున్నారు. ఆ హత్యకూ తమకు ఏం సబంధంలేదని … అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన గగ్గోలు పెడుతున్నారు. కానీ అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానం రావడానికి.. ప్రజలు కూడా అవినాష్ పాత్ర ఉందని నమ్మడానికి కారణం.. సాక్ష్యాలను తుడిచేయడం. దానిపై క్లారిటీ ఇస్తేనే… అవినాష్ రెడ్డి వాదనకు విలువ ఉంటుంది.
వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా చెబుతున్న అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసుతో తనకు సంబంధమే లేదని అవినాష్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఆయన పదే పదే కోర్టుల్లో వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి చెబుతున్నారు.
వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన తాజాగా దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. ఈకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొదట వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి చెప్పారు. ఆయన ముస్లిం కుమారుడు.. వారసుడు.. ఆస్తి గొడవలు అని చెప్పారు. తర్వాత విచ్చలవిడి లైంగిక సంబంధాల గురించి చెబుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్లో సునీల్ యాదవ్ తల్లిని వేధించడం వల్లే సునీల్ యాదవ్ చంపేశాడని చెబుతున్నారు.
వాళ్లు చంపితే ఎందుకు గుండెపోటుగా నమ్మించాలనుకున్నారు ?
వైఎస్ వివేకా చనిపోయిన రోజున ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదట గుండె పోటు అని ప్రచారం చేశారు. హైదరాబాద్లో ఉన్న వివేకా కుమార్తె, అల్లుడు రాక ముందే ఖననం చేయాలనుకున్నారన్న ప్రచారమూ జరిగింది. పోస్టుమార్టం నిర్వహించలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపించారు. అప్పటి వరకూ అందరూ గుండెపోటు అనే ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో గాయాలు బయటపడిన తర్వాతనే హత్య అని అంగీకరించారు. ాఅదే సమయంలో వివేకా ఇంట్లో సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు. రక్తాన్ని తుడిచేశారు. ఇవన్నీ పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. మృతదేహానికి కట్లు కట్టారు. ఇదంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు తాను నమ్మించాలని అనుకోలేదని మాటలతో చెబితే సాధ్యం కాదు. అది నిజమని నిరూపించాలి
వైఎస్ఆర్సీపీకి ఫుల్ డ్యామేజ్ !
వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారాయి. విపక్ష పార్టీలు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నయి. ఓ వైపు కోడి కత్తి కేసు.. మరో వైపు వివేకా హత్య కేసు విచారణలు మొత్తం వైసీపీ పార్టీకి ఇబ్బందికరంగానే మారాయి. కోడికత్తి కేసులో ఎన్ఐఏ విచారణ వైసీపీ కోరుకున్నదే. అయితే ఇప్పుడు ఎన్ఐఏ విచారణను కూడా తప్పు పడుతున్నారు. ఇక అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ విచారణను తప్పు పట్టకుండా ఉంటారా ? . అయితే ఇలా అన్ని రకాల విచారణలను తప్పు పట్టుకుంటూ పోతూండటం కూడా వైసీపీపై జనంలో వ్యతిరేక భావం పెరగడానికి కారణం అవుతోంది. మొత్తంగా వివాదాస్పద కేసులను ఎదుర్కోడంలో వైసీపీ నేతలు స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫలితంగా ప్రజల్లో ఇమేజ్ బ్యాడ్ అవుతోంది.