కడప లోక్‌సభ పరిలో టీడీపీ తరపున వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత బరిలోకి దిగబోతున్నారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసు క్లైమాక్స్‌కు వచ్చిన సమయంలో ఇలాంటి వార్తలు రావడం కీలకంగా మారింది. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడే వరకూ విశ్రమించబోనని సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె ఎక్కడా రాజకీయ అంశాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. వైఎస్ వివేకా బతికి ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడూ రాజకీయ పరమైన చర్చల్లోకి రాలేదు.
వైఎస్ సునీతను టీడీపీ ఆహ్వానిస్తోందా ?
కడప లోక్‌సభ పరిధిలో వైసీపీని ఓడించాలంటే… వైెస్ కుటుంబసభ్యుల వల్లనే సాధ్యమన్న ఓ అభిప్రాయం ఉంది. వైఎస్ కుటుంబం ఇప్పటి వరకూ ఏకతాటిపైకి ఉంది. వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే ప్రస్తుతం వైఎస్ జగన్‌తో విబేధించే కుటుంబసభ్యులు.. తెలంగాణకు వెళ్లి రాజకీయం చేస్తున్నారు కానీ.. ఏపీలో విడిగా రాజకీయం చేయడం లేదు. అంటే ఇప్పటికీ వైఎస్ ఫ్యామిలీ రాజకీయంగా… ఒక వర్గమనే అనుకోవచ్చు.
ఇప్పటి వరకూ ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని సునీత
కానీ వైఎస్ సునీతను టీడీపీ తరపున పోటీ చేయించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మత్రం తగ్గడం లేదు. అందుకే ఆమెకు పూర్తి స్థాయిలో టీడీపీ వైపు నుంచి న్యాయపరమైన సహాయాలు అందుతున్నాయంటున్నారు. ప్రో తెలుగుదేశం పార్టీ మీడియా కూడా సునీతకు విస్తృతమైన కవరేజీ ఇస్తోంది. వైఎస్ పోరాట తత్వానికి నిజమైన వారసులు ఆమే అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌కు చెక్ పెట్టాలంటే.. సునీత కరెక్ట్ అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఈ అంశంపై టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు. సునీత వర్గం కూడా నోరు మెదపడం లేదు.
సునీత రాజకీయ నేతగా మారితే సంచలనమే !
ఎలా చూసినా వైఎస్ సునీత కుటుంబానికి దూరమయ్యారు. ఆమెకు ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకించే కుటుంబసభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఒక వేళ ఆమె రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలనుకుంటే… తెలుగుదేశం పార్టీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే అవకాశం ఉంది. రాజకీయాల్లో సానుభూతి పవర్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కడపలో ఆ సానుభూతి వర్కవుట్ అయితే.. వైఎస్ కుటుంబంతోనే వైఎస్ హవాకు చెక్ పెట్టినట్లవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.