కాంగ్రెస్ పార్టీలో అంతేనా. వాళ్ల తీరు మారదా. పెత్తందారీతత్వం, జనాన్ని వేధించడం వారికి నిత్యకృత్యమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, అసోం యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంకితా దత్తాను లైంగికంగా వేధించడంతో ఆయనపై కేసు నమోదైంది. పైగా శ్రీనివాస్ ను మండలించాల్సిన కాంగ్రెస్ పెద్దలు అంకితనే బహిష్కరించి తమ నైజాన్ని చాటుకున్నారు.
అంకిత ఆరోపణలేమిటి ?
అంకితను గత ఆరునెలలుగా బీవీ శ్రీనివాస్ వేర్వేరు పద్ధతుల్లో వేధించి, విసిగించాడు. అతని భాష, అతని బాడీ లాంగ్వేజ్ గగుర్పొడిచేదిగా ఉందని అంకిత వాపోయారు. . మహిళవు నువ్వేమి చేస్తావంటూ బెదిరించేవాడట. పైగా బీజేపీ వాళ్లతో టచ్ లో ఉంటే నాకేం భయమని సవాలు చేసే వాడట. ఆమె బీజేపీ వాళ్లతో మాట్లాడిందీ లేదట. ఈ సంగతి రాహుల్ గాంధీ వద్ద, ఇతర నేతల వద్ద ప్రస్తావించి విసిగిపోయానని ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బయటకు వచ్చి శ్రీనివాస్ దురాగతాలను వెల్లడిస్తున్నానని ఆమె అన్నారు. అతని చూపులే అసభ్యంగా ఉంటాయని ఆమె ఆరోపించారు. అతని ప్రవర్తన ఉన్మాదంగానూ, అసభ్యంగానూ ఉంటుందన్నారు .కాంగ్రెస్ రాయపూర్ సదస్సులోనూ తనను లైంగికంగా వేధించారన్నారు.
అసోంలో ఎఫ్ఐఆర్
అధిష్టానం పట్టించుకోకపోవడంతో అంకితా దత్తా నేరుగా అసోంలోని దిస్పూర్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు.దీనితో ఆరోపణలపై విచారణకు మే 2న హాజరు కావాలని అసోం పోలీసులు శ్రీనివాస్ కు సమన్లు పంపారు. అంతే పార్టీ వ్యవహారాలను రోడ్డు కీడ్చారని కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహం చెందారు. ఎలాంటి ఇంటర్నల్ ఎంక్వయిరీ లేకుండా ఆమెను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. పైగా అంకిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ లేఖలో ఆరోపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ నేతలకు మహిళలపై కనీస గౌరవం లేదా.. అని అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ ప్రశ్నించారు…
అంకితా దత్త ఎవరు ?
అంకిత కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి అంజన్ దత్తా … అసోం పీసీసీ అధ్యక్షిడిగానూ రవాణా, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగానూ పనిచేశారు..ఆమె తాత, థానేశ్వర్ దత్తా 1978లో కాంగ్రెస్ చీలిక సమయంలో ఇందిరా గాంధీకి మద్దతు ఇచ్చారు.. అదే సంవత్సరం శివసాగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంకిత కూడా పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తుంటారు. రాహుల్ గాంధీ నిర్వహించిన కాంగ్రెస్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఏమంటోంది..
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంకితపైనా, బీజేపీ పైనా ఎదురుదాడి చేస్తోంది. శ్రీనివాస్ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకుడిని, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ లేని సమస్యను సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే అసోం పోలీసులు పంపిన సమన్లను అందించేందుకు కర్ణాటక ఖాకీలు శ్రీనివాస్ వద్దకు వెళితే అతను పోలీసులను కొట్టబోయారు.వీరంగం సృష్టించారు..