ఉత్తర ప్రదేశ్ ఒకప్పుడు గూండా రాజ్యం. జనం బయటకు వచ్చేందుకే భయపడే ప్రాంతం. వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు సర్వసాధారణంగా ఉండేవి. రాజకీయ రౌడీయిజానికి యూపీ మారుపేరుగా ఉండేది. బీజేపీ నేత యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మారిపోయింది. తప్పు చేసినవాడు ఎంతటివాడైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని యోగీ తేల్చిచెప్పేశారు. ఆయన అధికారానికి వచ్చినప్పటి నుంచి రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు..
రోడ్డు తవ్వేసిన ఎమ్మెల్యే అనుచరులు
షాజాన్పూర్ లోని జైతీపూర్ ప్రాంతంలో ఎమ్మెల్యే అనుచరులు ఏడు కిలోమీటర్ల మేర కొత్తగా వేసిన రోడ్డును తవ్వేశారు. వారంతా స్థానిక ఎమ్మెల్యే అనుచరులని తేలింది. రూ. 12 కోట్ల రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి గూండా టాక్స్ కట్టలేదన్న కోపంతో జగవీర్ సింగ్ అనే వ్యక్తి తన మనుషులను తీసుకొచ్చి జేసీబీలతో రోడ్డు తవ్వించేశాడు. పైగా కాంట్రాక్టకులు సంబంధించిన యంత్రాలను తగులబెట్టి, కూలీలపై దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
అధికారులపై యోగీ సీరియస్ …
మీడియా వార్తల ద్వారా రోడ్డు తవ్వేసిన విషయం తెలుసుకున్న యోగీ ఆదిత్యనాథ్ మీరేమీ చేస్తున్నారంటూ అధికారులను మందలించారు. అంతే జిల్లా యంత్రాంగం, ప్రజా పనుల శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. దాడి చేసిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. జగవీర్ సింగ్ పరారీలో ఉన్నాడు. జరిగిన నష్టాన్ని ప్రజా పనుల శాఖ చీఫ్ ఇంజనీర్ అంచనా వేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆ సొమ్మును రౌడీ మూకల నుంచి వసూలు చేస్తారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సురేశ్ కుమార్ ఖన్నా మాత్రం తనకేమీ తెలియదంటున్నారు. కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడాడని నిలదీసిన మాట నిజమేనంటున్నారు. కాంట్రాక్టరే రోడ్డు తవ్వేసి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎదురుదాడి చేశారు.అయితే ఆయన మాట నమ్మెందుకు జనం గానీ, అధికారులు గానీ సిద్దంగా లేరు.
నష్ట పరిచిన వాళ్లే కట్టాలి….
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది. అల్లర్లు, ఘర్షణల్లో ప్రజా ఆస్తులకు భంగం కలిగిస్తే .. ఆ పనిచేసిన వారి నుంచి వసూలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టి చాలా రోజులైంది. అలా వందల మందికి యూపీ ప్రభుత్వం బుద్ధి చెప్పింది. కొన్ని సందర్భాల్లో వారి ఇళ్లు కూల్చివేసి దారికి తెచ్చారు. దానితో యూపీలో హింస, విధ్వంసం చాలా వరకు తగ్గాయి. ప్రజలకు కూడా యోగీ ప్రభుత్వంపై గౌరవం పెరిగింది.పైగా గూండాలను, రౌడీలను, ఉగ్రవాదులను, రాజకీయ హింసకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్లు చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచగలిగింది.