నిన్నటి మిత్రులు నేటి శత్రువులు

నిన్నటి మిత్రులు నేటి శత్రువులు

మిత్రులు శత్రువులైతే ఆ ప్రభావం చాలు కఠినంగా, కరుకుగా ఉంటుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య కూడా అలాంటి సంబంధాలే ఉన్నాయనుకోవాలి. ఒకప్పుడు నితీశ్ తిరుగులేని నాయకుడు అని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నితీశ్ అంతటి దిగాజరిన నాయకుడు లేడని ప్రచారం చేస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా బిహార్ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.

ఇండియా గ్రూపుపై పెదవి విరుపు…

ప్రశాంత్ కిషోర్ , ఐ ప్యాక్ అనే ఎన్నికల వ్యూహ సంస్థ వ్యవస్థాపకుడు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పార్టీలకు ఆయన ఎన్నికల వ్యూహాలు రచిస్తారు. ఇప్పుడు బిహార్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేపట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా గ్రూపుకు పెద్దగా ప్రయోజనం ఉండదని విపక్ష నాయకులంతా కలిసినందువల్ల మోదీని ఓడించేస్తామనుకుంటే పొరపాటేనని ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు. ఇండియా గ్రూపు పరిస్తితి బిహార్లో మరీ దారుణంగా ఉందని వినిపిస్తున్న విశ్లేషణలను ప్రశాంత్ కిషోర్ సమర్థించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు కనీసం ఐదు లోక్ సభా స్థానాలు కూడా రావని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు.

రాహుల్ గాంధీ పాపులర్..
నితీశ్ కుమార్ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలా కోరుకునే ఇండియా గ్రూపు నేతలు చాలా మంది ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ లెక్క ప్రకారం నితీశ్ కుమార్ కు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదు.ఆయన దేశంలో అంత పాపులర్ లీడర్ కాదు. జనంలో నిత్యం తిరుగుతూ అందరినీ కలుపుకుపోయే రాహుల్ గాంధీ మాత్రం పాపులర్ లీడర్ అని ప్రశాంత్ కిషోర్ అంచనా వేస్తున్నారు. దేశంలో మోదీ నెంబర్ వన్ అయితే రాహుల్ సుదూరంగా నెంబర్ టూగా ఉన్నారని నితీశ్ కనీసం నెంబర్ 10గా కూడా లేరన్నది ప్రశాంత్ కిషోర్ వాదన. లోక్ సభ ఎన్నికల తర్వాత నితీశ్ పార్టీ మూతబడుతుందన్నది ప్రశాంత్ కిషోరో జోస్యం

ప్రశాంత్ ను వెళ్లగొట్టిన నితీష్ కోపం అందుకేనా.. ?

ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జేడీయూలోనే ఉండేవారు. నితీశ్ కు ఆయనంటే నమ్మకం కూడానూ. పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి మంచి చెడు చూసుకోమని చెప్పారు. అయితే నితీశ్ నచ్చని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టడంతో ప్రశాంత్ పై ఆయనకు కోపం వచ్చింది. బీసీ వర్గాలను ఎలా దగ్గరకు చేర్చుకోవాలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా నితీశ్ కు ఉద్భోదించాలనుకోవడం ఆయనకు సుతారమూ నచ్చలేదు. పైగా పార్టీపై బహిరంగ విమర్శలు చేస్తుండటంతో క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కోపమూ వచ్చింది. దానితో 2020 ప్రథమార్థంతో ప్రశాంత్ కిషోర్ ను జేడీయూ నుంచి తొలగించారు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని కూడా ప్రకటన విడుదల చేశారు. అప్పటి నుంచి నితీశ్ పై ప్రశాంత్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. నితీశ్ ను గద్దె దించి చూపిస్తానని సవాలు చేశారు. ఇప్పుడు ఆ పనే జరుగుతోంది.