భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఒక సంచలనంగా కనిపించారు. సంప్రదాయ పార్టీలకు పోటీగా కొత్త రాజకీయ స్రవంతిని సృష్టిస్తారనుకున్నారు. సామాన్యుల కోసం పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ప్రతీ సామాన్యుడికి మంచి జరుగుతుందని భావించారు. రాజకీయాలు ఆదర్శంగా ఉంటాయనుకున్నారు. అవినీతి వ్యతిరేకోద్యమంలో క్రియాశీల బాధ్యత వహించిన కేజ్రీవాల్… ఎలాంటి అవకతవకలకు తావు లేని ప్రభుత్వాన్ని నడిపిస్తారనుకున్నారు. కట్ చేసి చూస్తే ఆప్ దారి అడ్డదారి అయిపోయింది. కేజ్రీవాల్ చుట్టూ అవినీతిపరులు చేరారు. అందులో కేజ్రీవాల్ పాత్ర ఎంతనేదే పెద్ద ప్రశ్న…
నచ్చకపోయితే విసిరి పారెయ్యడమే..
కేజ్రీవాల్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే నాయకుడనుకున్నారు. దశాబ్దం కాలం పరిణామాలు చూస్తే మాత్రం ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తారని తెలిపోయింది. తనకు నచ్చని, తన విధానాలను ప్రశ్నించే నాయకులు ఎవరైనా సరే కేజ్రీవాల్ కు దూరం కావాల్సిందే. కేజ్రీవాల్ పిలుపు మేరకు ఆప్ లో చేరిన జర్నలిస్టు అశుతోష్ 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఇస్తారనుకున్న రాజ్యసభ సభ్యత్వాన్ని వ్యాపారవెత్త సుశీల్ గుప్తాకు కట్టబెట్టారు. దానితో కేజ్రీవాల్ ఆలోచనను అర్థం చేసుకుని అశుతోష్ .. ఆప్ నుంచి వైదొలిగారు.
పోర్టుఫోలియో లేకుండా జాగ్రత్త పడుతున్న నేత..
అవినీతి జరుగుతుందని, అవినీతి చేయాలని కేజ్రీవాల్ కు ముందే తెలుసు. దానిపై ఆయనకు ఒక అంచనా ఉందని కూడా అనుకోవాలి. అందుకే ఆయన ఢిల్లీకి పోర్టుఫోలియో లేని ముఖ్యమంత్రి. ఒక్క ఫైల్ మీద కూడా ఆయన సంతకాలు చేయరు. కేబినెట్ సమావేశాలు నిర్వహించరు.ఐనా అంతా ఆయన చెప్పినట్లే జరుగుతుంది. కాకపోతే ఎక్కడా ఆయన ప్రమేయం కనిపించదు. ఢిల్లీలోనే కాదు పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ చెప్పాలి, మంత్రులు చేయాలి అన్నట్లుగా పరిస్తితి ఉంది. విద్యా, వైద్య రంగంలో ఢిల్లీ నెంబర్ వన్ గా ఉందని కేజ్రీవాల్ చెప్పుకోవడం కూడా ఒట్టిమాటే. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాజధాని రాష్ట్రం బాగానే వెనుకబడి పోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఒక్కక్కరుగా జైలుకు…
కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న వారంతా ఒక్కరొక్కరుగా జైలుకు వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంకా తిహార్ జైలులోనే ఉన్నారు. మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్.. మనీ లాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఒకప్పుడు బెస్ట్ పార్లమెంటేరియన్ అని చెప్పుకునే సంజయ్ సింగ్ ను ఇటీవలే ఈడీ అరెస్టు చేసింది. పైగా సిసోడియా, సత్యేంద్ర జైన్ కు పద్మ విభూషణ్, భారతరత్న పురస్కారాలు వస్తాయని కేజ్రీవాల్ ప్రకటించడం ఎంత ఎక్కసెక్కాలో అర్థం చేసుకోవచ్చు. గతంలో జితేంద్ర తోమార్ ని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసింది. కేజ్రీవాల్ చాలా తెలివిగల వారు. ఆయన తన చేతికి మట్టి అంటకుండా పనిచేస్తారు.తనకు ఎదురు తిరిగిన వారిని ఎలా బయటకు పంపాలో కూాడ ఆయనకు బాగానే తెలుసు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణలను వదిలించుకుని ఆప్ కు తానొక్కడే సుప్రీం లీడర్ అని ముద్ర వేయించుకున్నారు.