వైసీపీ అధినేత జగన్ గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకట రమణను ఎంపిక చేశారు. ఆయన చాలాకాలం తరువాత జిల్లా వచ్చారు. ఆయన్ను జిల్లా కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జిల్లాలోని ముఖ్యనాయకులకు పరిచయం చేశారు. ఆ తరువాత ఆయన మళ్లీ ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన్ను మారుస్తారని ప్రచారమైంది. గతంలో క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరినకొద్ది రోజులకే నిష్క్రమించినట్టుగానే వెంకట రమణ కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది.
ఆళ్ల పేరును పరిశీలిస్తున్న సీఎం జగన్
తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఎంపిక చేస్తారని గురువారం కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించికపోతే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెబుతున్నారు. మంగళగిరి ఇన్చార్జిగా ఉన్న గంజి చిరంజీవి మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల లేదా ఆమె కుమార్తె లావణ్యను ఎంపిక చేస్తారని తెలిసింది. తెనాలి సీటు వైసిపికి కొంత ఆశాజనకంగా ఉంటుందని సర్వేల్లో వెల్లడయిందని తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మార్పుపై దృష్టి సారించలేదు. అయితే ఆకస్మికంగా సినీ నిర్మాత దాసరి కిరణ్ తెనాలి స్థానం కోరడంతో శివకుమార్‌ను పొన్నూరు వెళ్లాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఆయన ససేమిరా అంటున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు టిక్కెట్ విషయంపై ఇంకా స్పష్టత లేదు.
పొన్నూరు ఎమ్మెల్యేలకు టిక్కెట్ కష్టమే !
వెంకట రమణ స్థానంలో లోక్‌సభకు అవకాశం ఇస్తే సరే లేదంటే ఆయనకు మొండిచేయి చూపే అవకాశం ఉందని పార్టీలో ఆయన వ్యతిరేక గ్రూపు ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పొన్నూరు మండలం వెల్లలూరులో కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు లోక్‌సభకు తన కుమారుడు వెంకటరమణ, పొన్నూరుకు తన అల్లుడు ఎమ్మెల్యే రోశయ్య పేర్లు ప్రస్తావించకుండా మనం అంతా ఐక్యంగా ఉండి వైసిపిని గెలిపించుకుని, వైఎస్ జగన్‌ను మరోసారి సిఎం చేసుకోవాలని అన్నారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని కోరినట్టు తెలిసింది, సత్తెనపల్లిలో ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబును బందరు లోక్‌సభకు పంపుతారని తెలుస్తోంది. లేదంటే ఆయనకు పొన్నూరు నుంచి అవకాశం కల్పిస్తారని తెలిసింది.
ఇతర నియోజకవర్గాల్లోనూ మార్పు చేర్పులే !
పెదకూరపాడులో టిడిపి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ను ఎంపికచేస్తారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. భాష్యం ప్రవీణ్ వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు అల్లుడు కావడం వల్ల ఈ ప్రభావం ఎన్నికల్లో ఎంత ప్రభావం ఉంటుందోనని వైసిపి అధిష్టానం సర్వే చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు శంకరరావుకు సానుకూలత ఎక్కువగా ఉందని భావించిన అధిష్టానం టిడిపి అభ్యర్థిని బట్టి ఇక్కడ కూడా మార్పునకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదంటున్నారు. సామాజిక అంశాల ఆధారంగా ప్రత్తిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ మార్పుపై కూడా దృష్టి సారించినట్టు చెబుతున్నారు.