ఆంధ్రప్రదేశ్‌లో హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత మరో పార్టీ అక్కడ గెలవలేదు . అందుకే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూంటారు. అయితే ఇక్కడ టీడీపీ అంత బలంగా ఉందా అంటే… అసలు కారణం పోటీగా ఉన్న ఇతర పక్షాల్లో ఐక్యత లేకపోవడం. టీడీపీ ఐక్యంగా ఉంటే… ప్రత్యర్థిగా ఉండే పార్టీల్లో రెండు, మూడు వర్గాలంటున్నాయి. అందుకే వరుసగా టీడీపీ గెలుస్తూ ఉంది.
ఈ సారి ప్లాన్ మార్చిన వైసీపీ
హిందూపురంలో బాలకృష్ణపై నిలబెట్టడానికి సీఎం జగన్ .. దీపిక అనే కొత్త నేతను ఎంపిక చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జుతో గడప గడపకూ సమీక్షకు.. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ఇక్బాల్‌కు సమాచారం అందలేదు. దీపిక అనే నాయకురాలిని ఆహ్వానించారు. దీంతో హిందూపురం వైసీపీలో ఒక్క సారిగా ఆశ్చర్యం వ్యక్తమయింది. ఎందుకంటే హిందూపురం వైసీపీలో చాలా గ్రూపులున్నాయి కానీ.. ఆ గ్రూపుల్లో ఎప్పుడూ వినిపించని పేరు దీపిక. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ పోటీ చేశారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతో ఆయనే హిందూపురంలో పెత్తనం చేస్తున్నారు. అయితే ఆయనను బలంగా వ్యతిరేకించే వర్గం అక్కడ ఉంది. ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ వర్గంతో పాటు మరో రెండు వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి.ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన చౌళూరు రామకృష్ణారెడ్డి అనే నేత హత్యకు గురయ్యారు. ఈ హత్యలో ఇక్బాల్ పేరే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చర్యలు తీసుకోలేదు కానీ..ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
పెద్దగా ఎవరికీ తెలియని నేత దీపిక
బాలకృష్ణను ఢీ కొట్టాలంటే ఎలాంటి ఇమేజ్ లేని నేత అవసరం అని … ఐ ప్యాక్ డిసైడ్ చేయడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీపికను ఎంపిక చేశారని అంటున్నారు. పెద్దిరెడ్డిగా అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి ద్వారా ఎమ్మెల్సీకి చెక్‌పెట్టి, దీపికను తెరపైకి తీసుకొచ్చారని ంటున్నారు. రేపో.. మాపో.. నియోజకవర్గ ఇన్‌చార్జిగా దీపికను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే సమీక్షకు ఆహ్వానించారని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు.
చాపకింద నీరులా పని చేసుకుంటున్న బీజేపీ
హిందూపురంలో బీజేపీ చాప కింద నీరులా పని చేసుకుంటోంది. ఆదర్శ్ అనే యువనేతకు ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన పార్టీ కార్యక్రమాలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తున్నారు. కేంద్ర వల్ల జరుగుతున్న మేలు.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు వంటి వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో .. హిందూపురంలో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ తరపున కత్త అభ్యర్థికి అన్ని వర్గాల ఆమోదం లభిస్తే గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు