కర్నూలులో హఫీజ్ ఖాన్‌కు సెగ – వైసీపీ టిక్కెట్ రేసులో ఉన్నదెవరంటే ?

కర్నూలు నియోజకవర్గంలో ఈ సారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటు దక్కడం కష్టమన్న వాదన వినిపిస్తోంది. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఆ సీటు దక్కేది ఎవరికీ అనే ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎస్ వి మోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన కర్నూల్ నగరంలో ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పనులను ఎస్వీ ట్రస్టు ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల నుండి మంచి మన్నున్నలు పొందారు.

పార్టీ మారి ఎటూ కాకుండా పోయిన ఎస్వీ మోహన్ రెడ్డి

. ప్రతిపక్షంలో ఉన్న ఎస్వీ అధికార పార్టీలో చేరి నగరాన్ని అభివృద్ధి దిశగా నడపాలని అనుకున్నారు. అక్కడ కూడా అతనికి గుర్తింపు లభించక తీరా వైకాపా పార్టీని వీడి 2019లో తెదేపాలో చేరారు. ఎస్వీ పరిస్థితి ఎటు వెళ్లినా సీటు దొరకని పరిస్థితి. అందుకు చేసేదేం లేక గత కొన్ని సంవత్సరాలుగా సీటు కోసం వేచి చూస్తున్నారు. 2019లో టీడీపీ పార్టీ టీజీ భరత్ కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో బయటకు వచ్చారు. తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి వైసీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు మద్దతు పలికి ప్రచారం చేశారు. కాగా గత కొంతకాలం నుంచి కేబుల్ నెట్వర్క్ విషయం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది దీంతో క్యాడర్‌కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.

2024 ఎన్నికల కోసం నేతల విశ్వప్రయత్నాలు..!

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీలో టికెట్ల గోల మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు నువ్వంటే నేనా అంటూ కర్నూలు నియోజకవర్గంలో మూడు వర్గాలు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మరో ముస్లిం యువనేత బషీర్ రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య వర్గ విభేదాలు తలెత్తడంతో ఇరువురు మధ్య పోటీ ఏర్పడింది. ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ హై కమాండ్ దృష్టిలో పడేలా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల కాలంలో తమ వేరువేరు క్యాడర్ల ద్వారా తమ బలాబలాలను చూపించుకోవడం కోసం ఆ కార్యక్రమాల్లో బలప్రదర్శన చేస్తున్నారు.

మరో మైనార్టీ నేత కూడా ప్రయత్నం !

కర్నూలు నుంచి పోటీకి మరో మైనార్టీ నేత కూడా ప్రయత్నిస్తున్నారు. కర్నూలుకు చెందిన ఎమ్మెల్సీ ఇక్బాల్ ను ఇటీవల హిందూపురం ఇంచార్జ్ నుంచి తొలగించారు. దీంతో ఆయన తన సొంత ప్రాంతం అయిన కర్నూలు నుంచి టిక్కెట్ అడుగుతున్నారు. ఈ వర్గాల మధ్య కర్నూలు వైసీపీ నలిగిపోతోంది. హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మరో ముస్లిం యువనేత బషీర్ తో పాటు.. ఇక్బాల్ మధ్య నాలుగు స్తంభాలాట జరుగుతోంది.