గ్రామ స్వరాజ్యం కోసం మహాత్ముడు తపిస్తే… ఆ కల సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ఆర్థిక సంఘం సహా ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులను ఇచ్చి పంచాయతీలను బలోపేతం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం సమాంతర వ్యవస్థల్ని ఏర్పాటు చేసి పంచాయతీ నిధుల్ని లాగేసి… గ్రామ సీమల్ని నిర్వీర్యం చేస్తోంది. దానిపై బీజేపీ అన్ని జిల్లాల కలెక్టర్ల వద్ద ధర్నాలు చేపట్టింది.
మహాత్ముని స్వప్నం సాకారం చేసేందుకు మోదీ ప్రయత్నం
గ్రామస్థాయి ప్రభుత్వాలు పకడ్బందీగా పని చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ గట్టిగా నమ్ముతారు. అందుకే గ్రామ స్వరాజ్యం కోసం ఆయన తపించారు. గ్రామ పంచాయతీలు ఎంత బలంగా ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు గ్రామాల ఖాతాల్లోకి వస్తాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్. . సభ్యులు ఆ నిధులతో ప్రజలకు అవసరమైన పనులు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా చేయాల్సిన సాయం చేయకపోగా .. ఆర్థిక సంఘం నిధులూ ఊడ్చేస్తోంది. ఫలితంగా గ్రామాలు సమస్యల్లో మునిగి తేలుతున్నాయి. చిన్న అభివృద్ధి పని కాదు కదా.. కనీసం గ్రామస్తుల దాహార్తిని పంచాయతీలు తీల్చలేకపోతున్నారు.
నిధులన్నీ దోచేస్తున్న ఏపీ ప్రభుత్వం
పంచాయతీలకు మూడు రకాల ఆదాయ వనరులు ఉంటాయి. ఒకటి గ్రామానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. రెండోది గ్రామ పరిధిలోని వనరుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకుంటున్న లేదా వసూలు చేసుకుంటున్న పన్నుల్లో కొంత భాగం కేటాయించడం. మూడోది నేరుగా కేంద్ర ప్రభుత్వం … ఆర్థిక సంఘం కేటాయింపుల మేరకు ఇచ్చే నిధులు. అయితే ఓ మాదిరి గ్రామ పంచాయతీల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం… సిబ్బంది జీత భత్యాలకు కూడా సరిపోదు. ఇక ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాలు ఇవ్వడం ఎప్పుడో మానేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న వనరులతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోంది కానీ.. ఆ వనరులు ఉన్న గ్రామాలకు నిధుల వాటా ఇవ్వడం లేదు. ఇవ్వాల్సిందేనని అడగలేని వాతావరణం కల్పించారు. ఇక మూడోది నేరుగా పంచాయతీల ఖాతాలో కేంద్రం వేసే అర్థిక సంఘం నిధులు. టన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేయడం అసలు విషాదం. లుగేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. అన్నింటినీ స్వాహా చేసేశారు.
ప్రత్యామ్నాయ వ్యవస్థలతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం
కుట్ర పూరితంగా పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాటిని ఏర్పాటు చేసినప్పుడే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయన్న ఆందోళన గ్రామాల్లో కనిపించింది. పంచాయతీరాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని అనేక మంది ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటించిం. కానీ పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నలు సహజంగానే వచ్చాయి. సర్పంచ్ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవడం కూడా వివాదాస్పదమయింది. సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం. దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. అయినా పరిస్థితి మారలేదు.
ప్రభుత్వం తీరుపై బీజేపీ ఉద్యమం ప్రారంభించింది. ఇది ప్రారంభం మాత్రమేనని.. ముందు ముందు మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి… పంచాయతీల నిధులు ఇచ్చేలా మెడలు వంచుతామని ధీమాగా చెబుతున్నారు. ప్రజలతంతా తమతో కలసి రావాలని కోరుతున్నారు.