వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఆయన తెలంగాణకు చెందిన నేత. వైసీపీ పెద్దలు ఏ ఉద్దేశంతో ఆయనకు ఏపీకి తీసుకు వచ్చి రాజ్యసభ ఇచ్చారో కానీ.. ఆయన ఏపీ కోసం మాట్లాడిందేమీ లేదు. పైగా ఇప్పుడు.. ఆయన తెలంగాణ కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతల్ని ఇంటికి పిలిపించుకున్న కృష్ణయ్య
కృష్ణయ్య.. బీసీ సంక్షేమ సంఘం పేరుతో రాజకీయాలు చేస్తారు. బీసీల కోసం అంటూ హడావుడి చేస్తారు. కానీ ఆయన పూర్తిగా రాజకీయ అవకాశవాది. టీడీపీలో.. కాంగ్రెస్లో.. వైసీపీలో..మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ తో కలిస ిపని చేస్తున్నారు. బీసీల మద్దతు కావాలంటూ… కాంగ్రెస్ నేతలు కృష్ణయ్య ఇంటికి వెళ్లారు. బీసీలను పార్టీకి మద్దతు కోరాలని ఆ సామాజిక వర్గం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యను కాంగ్రెస్ నేతలు కలిశారు. తాజా రాజకీయ పరిస్థితి, ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య వారిని సన్మానించారు. తాను కాంగ్రెస్ పార్టీ నేతనేనన్నట్లుగా వ్యవహరించారు.
బీసీ జనగణనపేరుతో కాంగ్రెస్ కు దగ్గరైన కృష్ణయ్య
కొద్ది రోజులుగా బీసీ జనగణన చేయాలని కృష్ణయ్య.. డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా బీసీ జనగణనకు యువనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరి వేవ్ లెంగ్త్ కలిసిందని.. రాష్ట్రంలో ఉండే ఓబీసీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీల సమస్యలు, బడ్జెట్, ప్రజా ప్రతినిధుల అంశాలపై కాంగ్రెస్ సానుకూలంగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. కృష్ణయ్య డిమాండ్స్.. కాంగ్రెస్ నినాదం వేరు కాదని అంటున్నారు. తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీసీ సంఘాల మద్దతు కాంగ్రెస్ ఉంటుదని ప్రచారం చేయడానికి కృష్ణయ్య ఉపయోగపడుతున్నారు.
వైసీపీ హైకమాండ్ కు తెలిసే చేస్తున్నారా ?
వైసీపీ అదినేత. జగన్కు.. కాంగ్రెస్కు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ను వద్దనుకుని జగన్ వైసీపీ పెట్టారో అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటిది వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ.. తెలంగాణలో కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని జగన్ ఒప్పుకునే ప్రశ్నే లేదు. జగన్ ఒప్పుకోకపోతే కృష్ణయ్య ఎలా ముందుకెళ్తారు..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పదవి వచ్చేసింది కాబట్టి.. ఇక జగన్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదని కృష్ణయ్య వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కృష్ణయ్యపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వైసీపీలో వినిపిస్తున్నాయి.