అవసరం లేని ఫిరాయింపులు ఇప్పుడు వైసీపీకి కొన్ని నియోజకవర్గంలో గండం తెచ్చి పెడుతోంది. అందులో గన్నవరం ఒకటి. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకే జగన్ టిక్కెట్ ఇస్తారని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే తాను గన్నవరాన్ని వదిలే ప్రసక్తే లేదని గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు. ఆయన ఇటీవల యాక్టివ్ అయ్యారు. తనను జగన్ రెడ్డి అమెరికా నుంచి తీసుకు వచ్చి ఇక్కడ నడి రోడ్డు మీద వదిలేస్తారని అనుకోవడం లేదని మీడియాతో చెబుతున్నారు.
జగన్ చెప్పినా విననంటున్న యార్లగడ్డ
పెనమలూరు సీటు ఇస్తా అని జగన్ అంటే నేను ఇండియా వచ్చాననని చెబుతున్నారు. తర్వాత గన్నవరం సీటు నుంచి జగన్ పోటీ చేయమని చెబితే అక్కడ నుంచి పోటీ చేసానని వివరించారు. గన్నవరం లో వైసీపీని పటిష్టం చేశానని.. రిగ్గింగ్, దొంగ ఇళ్ళ పట్టాల కారణంగా ఓటమి పాలయ్యాని చెప్పారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. నేను గెలిచి ఉంటే నియోజక వర్గానికి ఈ ఖర్మ ఉండేది కాదని.. కొన్ని కారణాలతో గన్నవరంలో రాజకీయాలకు దూరంగా ఉన్నా తప్ప నియోజక వర్గానికి కాదన్నారు. జగన్ నాకు గన్నవరం అనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని .. వదులుకునే ప్రశ్నే లేదని అంటున్నారు. అమెరికా నుంచి తీసుకు వచ్చి జగన్ నన్ను క్రాస్ రోడ్డులో నిల్చో పెడతారని నేను అనుకోవటం లేదని వివరించారు. జగన్, వైసీపీ అధిష్టానం నాకు అన్యాయం చేస్తారని అనుకోవటం లేదని.. గత ఎన్నికల్లో నేనే ఇక్కడ నుంచి పోటీ చేశానని గుర్తు చే శారు. గన్నవరం వేరే సీటు వారికి ఇచ్చామని ఇంకా ప్రకటన చేయలేదు కదా అని యార్లగడ్డ అంటున్నారు.
వంశీకి సీటు ఖరారు చేసిన సీఎం జగన్
నిజానికి సీఎం జగన్ వంశీకి సీటు ఖరారు చేశారు. అందుకే యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. కానీ ఎన్నికలకు ముందు ఆయన అడ్డం తిరుగుతున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కొన్నాళ్లుగా వేరే పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా అదే ప్రయత్నంలో ఉన్నారని.. అందుకే జగన్ రెడ్డి తనను తీసుకొచ్చి మోసం చేశారన్న భావన అందరికీ కలిగేలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వంశీకి గన్నవరంలోనే మరో ప్రత్యర్థి ఉన్నారు. ఆయనే దుట్టా రామచంద్రరావు. టీడీపీ నుంచి వచ్చిన వారు తప్ప.. ఇంకెవరూ వంశీ వెంట లేరు. దీంతో గన్నవరంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
వైసీపీని డ్యామేజ్ చేసి టీడీపీలోకి యార్లగడ్డ !
జగన్ మోసం చేశారని.. ప్రజలకు చెప్పుకోవడానికి యార్లగడ్డ వెంకట్రావు ఇలా ప్రకటనలు చేస్తున్నారన్న అనుమానం.. వైసీపీ వర్గాల్లో ఉంది. యార్లగడ్డ దూకుడుగా ఉండే నేత. ఆయనకు జగన్ పై ప్రత్యేక అభిమానం ఏమీ లేదని అంటున్నారు. టీడీపీకి అభ్యర్థి దొరకక.. యార్లగడ్డను ఖరారు చేస్తే.. ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడం ఖాయమన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.