ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో సంక్షేమం, సమానత్వ సాధనకు ప్రయత్నం కనిపిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే నేతగా మోదీ పేరు స్ఖిరపడిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికల వేళ ఆయన ఓ కీలక నిర్ణయానికి తెరతీశారు. పార్లమెంటు, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ను ఆయన ఒప్పించారు. ఇక ఇప్పుడది పార్లమెంటు ప్రత్యేక సమావేశాలల్లో ప్రధాన చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.
అనుకున్నదానికంటే సగమే ప్రాతినిధ్యం
పార్లమెంటు ఉభయ సభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుత లోక్ సభలో కేవలం 78 మంది మహిళలున్నారు. మొత్తం సభ్యులైన 543లో అది 14 శాతం కంటే తక్కువే. రాజ్యసభలో కూడా మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువే ఉంది. అక్కడ 24 మంది మహిళలున్నారు.మహిళా బిల్లు ఆమోదం పొందితే లోక్ సభలో 179 మంది మహిళా ఎంపీలుంటారు. రాజ్యసభలో 81 మంది మహిళలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుంది.తెలంగాణ శాసనసభలో 39 మంది, శాసనమండలిలో 13 మంది సభ్యులుంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 58 మంది మహళలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాససనమండలిలో 20 మంది వరకు మహిళలుండొచ్చని అంచనా వేస్తున్నారు. మహిళా బిల్లు కోసం కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ ఉద్యమిస్తున్నారు. ఆమె ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. టపాసులు కాల్చారు.
దేవెగౌడ నుంచి ఇప్పటి వరకు
1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రభుత్వం రాజ్యాంగ 81వ సవరణ రూపంలో మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. చట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయించడమే ఆ బిల్లు లక్ష్యంగా చెప్పుకోవాలి. అంతకముందు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో ఇలాంటి ప్రయత్నం జరిగినా.. గట్టి పునాది పడింది మాత్రేం దేవెగౌడ కాలంలోనేనని చెప్పాలి. అయితే ఓసీబీ పార్టీల నేతలుగా చెప్పుకునే ములాయం సింగ్ యాదవ్ లాంటి వారు అనుమానాలు నివృత్తి చేయాలన్న డిమాండ్ తో అడ్డుతగిలడం కారణంగా బిల్లు వాయిదా పడింది. తర్వాత ఆ బిల్లు గీతా ముఖర్జీ నేతృత్వంలోని 21 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీకి వెళ్లింది. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, ఆంగ్లో ఇండియన్స్ కు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదన ఇంకా పెండింగ్ లో ఉంది.వరుసగా మూడు ఎన్నికల తర్వాత రొటేషన్ అమలు కావాలన్న ప్రతిపాదన చేశారు. తొలుత 15 సంవత్సరాల పాటు రిజర్వేషన్ అమలు చేసి తర్వాత దాన్ని పొడిగించే రాజ్యాంగ సవరణ చేయాలని ప్రతిపాదించారు. 2008 వరకు తరచూ ఈ బిల్లును సభలో ప్రవేశ పెడుతూనే ఉన్నారు. అప్పట్లో బిల్లును న్యాయశాఖ స్టాండింగ్ కమిటీకి పంపారు. మహిళా రిజర్వేషన్ 20 శాతం దాటకూడదని సమాజ్ వాదీ పార్టీ అడ్డుతగలడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీలో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేయాలన్న ప్రతిపాదన రాగా.. ఓడిపోయే సీట్లు మహిళలకు కేటాయిస్తారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళా బిల్లు అమలైతే రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ కూడా మారాల్సిన అనివార్యత ఉంది.
విపక్షాల ద్వంద్వ నీతిని ఎండగట్టే సమయం
మహిళ రిజర్వేషన్ విషయంలో కొన్ని పార్టీలు రెండు నాల్కల ధోరణిని పాటిస్తున్నాయి. ఎస్పీ, ఆర్జెడీ, జేడీయూ లాంటి పార్టీలు బహిరంగంగా తమ మద్దతు ప్రకటిస్తూనే కమిటీల్లో మాత్రం చర్చ ముందుకు సాగకుండా అడ్డు తగులుతూ వచ్చాయి. ఇప్పుడు మోదీ స్వయంగా రంగంలోకి దిగడంతో అలాంటి పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. తాజా నిర్ణయాన్ని వాళ్లు వ్యతిరేకించలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు.ట్రిపుల్ తలాఖ్ బిల్లు ద్వారా ఇప్పటికే ప్రధాని మోదీ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారు. యూపీలో బీజేపీ అధికారం సుస్థిరం చేసుకోవడం వెనుక ట్రిపుల్ తలాఖ్ రద్దు కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. ఇప్పుడు చట్ట సభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందుతున్న నేపథ్యంలో మహిళలు ఏకమొత్తంగా బీజేపీ వైపు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ కు డిమాండ్ చేస్తున్నందున రాజ్యసభలో ఆమోదం పొందడం కూడా కష్టమేమీ కాదని చెప్పొచ్చు. సరిగ్గా బీఆర్ఎస్ లాంటి పార్టీలు మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్న తరుణంలోనే బీజేపీ ఆ బిల్లును ప్రవేశ పెడుతుండటంతో అన్ని పార్టీలు దారిలోకి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. పైగా మోదీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే ఎంతటి రిస్కునైనా ఆయన భరించేందుకు ముందుకు వస్తారు. ములాయం, లాలూ పీరియడ్ లో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న రాజకీయ స్థితిగతులు వేరు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ లాంటి దక్షిణాది పార్టీలన్నీ అనివార్యంగా మోదీ నిర్ణయాలకు మద్దతు పలుకుతాయని ఆయనకు తెలుసు. సామాజిక న్యాయం పేరుతో రాజకీయాలు చేసే డీఎంకే, అన్నాడీఎంకే కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే.. అందుకే దటీస్ మోదీ అనాలేమో…