మహిళా బిల్లుకు లోక్ సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాజ్యసభలోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఆమోదం పొందడం లాంఛనమే అవుతుంది. ఎందుకంటే మజ్లీస్ మినహా అన్ని పార్టీలు ఇప్పుడు మహిళా బిల్లును సమర్థిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు చేయడం ఒక లాంఛనమవుతుండగా, 27 సంవత్సరాల జాప్యం తర్వాత బిల్లుకు తుది రూపు ఇచ్చిన బీజేపీలో జోష్ కనిపిస్తోంది. ప్రజాసంక్షేమం కోసం, సమానత్వ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకునేందుకు బీజేపీకి మంచి అవకాశం కూడా వచ్చింది.
మహిళా ఓటింగ్ లో గణనీయమైన వృద్ధి
ఒకప్పుడు మహిళలు ఓటేసేందుకు కూడా వచ్చే వాళ్లు కాదు. 1989 నాటి గణాంకాల ప్రకారం పురుషుల, మహిళ ఓటింగ్ లో 6.84 శాతం తేడా ఉండేది. అది ఈ ఏడాది 0.98 శాతానికి తగ్గింది. 2000 సంవత్సరం నుంచి గ్యాప్ తగ్గుతూ రావడం మహిళల్లో రాజకీయ చైతన్యానికి నిదర్శనమని భావిస్తున్నారు. గోవా సహా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఓటేశారు.అయితే పోటీ విషయంలో మాత్రం మహిళలు బాగా వెనుకబడిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక మహిళా అభ్యర్థి కూడా ఉంటడం లేదు. గోవా అసెంబ్లీకి పోటీ చేసిన వారిలో కేవలం 9 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారంటే అతిశయోక్తి కాబోది. మహిళా రిజర్వేషన్ తో ఈ దుస్థితి నుంచి బయట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం..
మహిళా బిల్లు తక్షణమే అమలుకు రాకపోవచ్చు. దాని ఫలాలు అందుకునేందుకు 2029 వరకు వేచి చూడాల్సి రావచ్చు. కాకపోతే ఈ ఏడాది ఆఖరుకు జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాత్రం దాని ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబరులో ఎన్నికలు జరగుతాయి. బీజేపీ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్ల దిశగా మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించింది. ఈ సారి రాజస్థాన్ లో గెలిచి తీరాలని తీర్మానించుకుంది. తెలంగాణలో కూడా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఈ పరిస్థితుల్లోనే మహిళా బిల్లు ఆమోదం పొందడం పార్టీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మధ్యప్రదేస్లో మామాజీ సర్కారు ( సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్) లాడ్లీ బెహన్ యోజనాతో మహిళలను ఆకట్టుకుంటోంది. నెలకు వెయ్యి రుపాయలు మహిళల ఖాతాలో వేస్తోంది. ఇటీవల రాఖీ పండుగను పురిస్కరించుకుని అదనంగా రూ. 250 ప్రియమైన సోదరీమణులకు అందించింది. త్వరలోనే లాడ్లీ బెహన్ ఖాతాలో రూ. 3000 వేస్తామని మామాజీ ప్రకటించారు.
బీజేపీకి అడ్వాంటేజ్ అంటున్న నిన్నటి అనుభవం
కేంద్రంలో మోదీ అధికారానికి రాగానే ముమ్మారు తలాఖ్ ను నిషేధించారు. దానితో వరుస అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ లబ్ధి పొందింది. అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లో అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. ఇప్పటికే చత్తీస్ గఢ్, రాజస్థాన్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో మహిళా ఓటర్లు అధికార బీజేపీ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. తెలంగాణలోనూ అధికార మార్పు అనివార్యమన్న వాదన వినిపిస్తోంది. అటు ఇటుగా ఆలోచిస్తున్న తటస్థ మహిళలకు … 33 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనతో బీజేపీ పట్ల వారికి పూర్తి విశ్వాసం కలిగే అవకాశాలున్నాయి. సామాజిక న్యాయం కోరుకునే వారంతా ఇప్పుడు బీజేపీ వైపే చేస్తూ కుహానా సిద్ధాంతాలను ప్రచారం చేసే రాజకీయ పార్టీలకు దూరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక ముందడుగు పడిన తర్వాత రిజర్వేషన్ ఎప్పుడైనా వస్తుందని మహిళలకు తెలుసు. అది బీజేపీ వల్లే సాధ్యమైందని కూడా వారు నమ్ముతున్నారు. దీనిపై వ్యతిరేక ప్రచారాన్ని సైతం వాళ్లు కొట్టి పారేస్తున్నారు.