తమిళ రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రి ఇస్తారా..?

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే రాజకీయం ఒక రబ్బరు సంచి లాంటిది. రబ్బరు సంచిలో ఎన్ని వస్తువులు పెట్టినా మరో వస్తువుకు చోటు ఉన్నట్లే అనిపిస్తుంది. రాజకీయాలు కూడా అంతే.రాజకీయ యవనికపై ఎంత మంది నాయకులు నాట్యమాడినా మరికొంత వాక్యూమ్ కనిపిస్తునే ఉంటుంది. ఇంకో మంచి నాయకుడు వస్తే బావుంటుందని జనం ఎదురు చూస్తుంటారు..

టాపర్ల కోసం విజయ్ కార్యక్రమం

తమిళ సినీ దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్న చర్చ మొదలైంది. దళపతి చెన్నైలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో టాప్ ముగ్గురిని వారి తల్లిదండ్రులను తీసుకొచ్చి సన్మానించారు. నగదు పురస్కారం కూడా అందజేశారు. ఈ పనులన్నీ విజయ్ అభిమాన సంఘాల సమాఖ్య అయిన విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటు చేసింది. ప్రజలకు, విజయ్ కు మధ్య మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాంగా దీన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళపతి విజయ్ మాట్లాడుతూ డబ్బులు తీసుకుని ఓటు వేయవద్దని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు 15 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వెచ్చించిన మొత్తాన్ని ఎలా భర్తీ చేస్తారని అవినీతి ఎలా మొదలవుతోందో తెలుసుకోవాలని అన్నారు. ఇదీ విజయ్ రాజకీయ అరంగేట్రానికి సంకేతమని ఆయన అభిమానులు చెబుతున్నారు.

గతంలో రాజకీయాలకు దూరం..

విజయ్ గతంలోనే రాజకీయాలకు రావాలని అభిమానులు ఎదురు చూశారు. ఆయన వాటిని తిరస్కరిస్తూనే వచ్చారు. ఒక్క సారయితే నేను రాను అని డైరెక్టుగా చెప్పేశారు. 2020లో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకు పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. విజయ్ అభిమాన సంఘాల సమాఖ్యను రాజకీయ పార్టీగా రిజిష్టర్ చేశారు. దానితో విజయ్ టెన్షన్ పడిపోయి తనకు ఆ రాజకీయ పార్టీకి సంబంధం లేదని ప్రకటించేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత చప్పబడిపోయిన అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది.

అన్నాడీఎంకే స్థానంలో విజయ్ పార్టీ

తమిళ సినీ పరిశ్రమలో చాలా రోజులుగా విజయ్ నెంబర్ వన్ నటుడు. కొత్త యువ హీరోలు వచ్చిన ఆయనతో పోటీ పడలేకపోతున్నారు. జనంలో కూడా అభిమానం రోజురోజుకు పెరిగిపోతోంది. దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని తన అభిమాన సంఘాల సమాఖ్య నేతలు కోరితే వీలైతే చూద్దామని విజయ్ సమాధానమిచ్చారట. రజనీకాంత్ మాదిరిగా దాగుడు మూతలు ఆడి వదిలెయ్యకుండా రాజకీయాలు చేయాలని దళపతి విజయ్ ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తే కమల్ హాసన్ లాగ ఫెయిల్ కాకూడదని కూడా భావిస్తున్నారట. ఏ పని చేసినా ప్రజలకు చేరువగా ఉండాలనుకునే విజయ్… సమాజ సేవ కారణంగా కూడా పాపులర్ అయ్యారు. పైగా 2021 తర్వాత అన్నాడీఎంకేలో పరిణామాలు ఆ పార్టీని బలహీన పరిచాయి. జయలలిత లాంటి ప్రజాదరణ ఉన్న నాయకురాలు లేకపోవడంతో అన్నాడీఎంకే కూనారిల్లుతోంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లో రాణించాలని విజయ్ భావిస్తున్నారు.ప్రస్తుత సీఎం స్టాలన్ కు తను మంచి పోటీ అవుతానని ఎదురు చూస్తున్నారు…