చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?

ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి మద్దతిచ్చి.. స్వపక్షంలో విపక్షంగా ఉంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే పవన్ కల్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేత

ఎపీలో ఎన్డీఏ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవబోతోంది. కాస్త తగ్గి అయినా ఓట్లు చీలిపోకుండా చూసుకుని విజయం సాధించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్ కల్యాణే ఓట్లు చీలకూడదని ముందుగా ప్రకటన చేశారని చంద్రబాబు ప్రతి సభలోనూ క్రెడిట్ ఇచ్చారు. అందుకే ప్రభుత్వంలోనూ ఆయన కీలకంగా ఉంటారని అంచనా వేస్తున్నారు పవన్ కల్యాణ్ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది పవర్ షేరింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు . పవర్ షేరింగ్ గురించి కాదు అసలు ప్రభుత్వంలో భాగం అవుతారా లేదా అన్నదానిపైనా సందేహం ఉంది.

పవన్ ఓకే ఏకైక డిప్యూటీ సీఎం ఖాయం !

పవన్ కల్యాణ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో చెబుతున్నారు అయితే ఆయన ఇచ్చే హామీలు వ్యక్తిగతం కావు. కూటమి తరపునే. అంటే కూటమి వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ఉంటారా ఉండరా అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. తాను ప్రభుత్వంలో ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లుగా కూడా మాటల్లో ఎప్పుడూ చెప్పలేదు. పవన్ కల్యాణ్ కు కూటమిలో ఉన్న ప్రాధాన్యం కారణంగా ఆయన కోరుకుంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్టు లభిస్తుంది. పవన్ కు చంద్రబాబు ఇచ్చే ప్రయారిటీ ప్రకారం చూసినా ఆ పదవి ఖాయం.

రాష్ట్ర కేబినెట్ లో బీజేపీ చేరుతుందా ?

జనసేనతో పాటు బీజేపీ కూడా కూటమిలో ఉంది. బీజేపీ కూటమి నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి ఒకటి లేదా రెండు మంత్రి పదవులు అయినా ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ కూటమిలో చేరే అవకాశం ఉందా లేదా అన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది జాతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు . కేంద్రంలో టీడీపీ చేరితే రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది.