వైసీపీ బీసీ అస్త్రం – టీడీపీ ఓటు బ్యాంక్ కదిలిపోతుందా ?

ఏపీలో రెండోసారి అధికారం కోసం ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత వైఎస్ జ‌గ‌న్ బీసీ అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇందు కోసం సీనియర్లు – మంత్రులకు షాకులు ఇస్తున్నారు. జ‌గ‌న్ మార్పులు మొద‌లుపెట్టిన తొలి జాబితాలోనే ముగ్గురు మంత్రులు (విడుద‌ల ర‌జ‌నీ, ఆదిమూల‌పు సురేశ్‌, మేరుగ నాగార్జున‌ వారి నియోజ‌క‌వ‌ర్గాలను కోల్పోయారు. రెండో విడతలో మరో ఆరుగురు మంత్రుల విషయంలోనూ ఇదే త‌ర‌హా షాకులు ఉంటాయ‌ని తెలుస్తోంది.

మంత్రులకూ ఈ సారి మొండి చేయి !

రాయ‌ల‌సీమ ప్రాంతంలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు.. ఉత్తరాంధ్ర, గోదవరి జిల్లాల్లోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే వారికి స‌మాచారం కూడా చేరిపోయిందంటున్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీ ఓట్లు వెన్నెముక‌గా చెబుతారు. స‌రిగ్గా ఇప్పుడు బీసీ ఓట్ల‌నే టార్గెట్‌గా జ‌గ‌న్ అభ్య‌ర్థుల ఎంపిక చేస్తున్నారని తెలుస్తున్నది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో రెండుసార్లు నారా లోకేశ్‌ను ఓడించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని ఈసారి ప‌క్క‌న‌బెట్టి బీసీ (పద్మ‌శాలి) సామాజిక వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవిని జ‌గ‌న్ రంగంలోకి దించుతున్నారు.

బీసీ ఫార్ములాకు పెద్ద పీట

బీసీ ఫార్ములాను ప‌లుచోట్ల ఉపయోగించి తానే అస‌లైన బీసీ బంధు అని చెప్ప‌డం వైసీపీ ల‌క్ష్యంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. ఆరోగ్య‌శాఖ మంత్రి విడదల రజనిని చిలకలూరి పేట అసెంబ్లీ నుంచి మార్చి గుంటూరు పశ్చిమకు మార్చారు. అదే విధంగా పవన్ కల్యాణ్ పై గాజువాకలో గెలిచిన తిప్పారెడ్డి నాగిరెడ్డిని, అత‌ని కుమారున్ని కాద‌ని బీసీ అభ్యర్థిని ఎంపిక చేశారు. రేపల్లెలో టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్‌ గణేష్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఎంపీ స్థానాల‌పైనా ప్ర‌త్యేక గురి ఇటు అసెంబ్లీ – అటు పార్ల‌మెంటు సీట్లలో ప్రతిపక్షాలపై గ‌త ఎన్నిక‌ల త‌ర‌హాలో పైచేయి సాధించాల‌న్నది జ‌గ‌న్ ల‌క్ష్యంగా చెబుతున్నారు.

ఎవరూ ఊహించని అభ్యర్థులు

ప్ర‌తిప‌క్షం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్థుల‌ను తెర‌మీద‌కు తెచ్చే ప్ర‌ణాళిక‌లు జ‌గ‌న్ వేసుకున్నార‌ని చెబుతున్నారు. వైసీపీకి చెందిన ప్రస్తుత ఎంపీలను కొంద‌రిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి, కొందరు సీనియర్లను లోక్ సభకు పంపాలని సీఎం జగన్ దాదాపు నిర్ణయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బలమైన బీసీ అభ్యర్థులు బరిలో నిలబడితే.. టీడీపీ ఓటు బ్యాంక్ కదిలిపోతుందని అంచనా వేస్తున్నారు.