ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం.. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి జిల్లా హెడ్‌క్వార్ట్ అయిన మచిలీపట్నంలో ఈ సారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. వైసీపీ నుంచి ఈ సారి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేశారు. పేర్నినాని పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకుని తన తనయుడి విజయం కోసం ప్రచారం చేశారు.
మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా పేర్ని కుటుంబం
టీడీపీ ఆవిర్భావం నుంచి మచిలీపట్నంలో పేర్ని ఫ్యామిలీ ఆ పార్టీకి ప్రత్యర్ధిగా ఉంటూ వచ్చింది. 1983లో మొదటి సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పేర్ని వెంకట్రామయ్య తండ్రి పేర్ని కృష్ణమూర్తి పోటీ చేశారు. 1989లో గెలిచి మంత్రి అయ్యారు. 1999 కృష్ణమూర్తి వారసుడిగా పేర్ని నాని రేసులోకి వచ్చారు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన పేర్ని నాని 2004లో విజయం దక్కించుకున్నారు. 2009లో గెలిచి వైసీపీలోచేరారు. 2014లో ఓఢిపోయి.. 2019లో గెలుపొందిన నాని వైసీపీ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు.. ఈ సారి తన తనయుడు పేర్ని కిట్టూని పొలిటికల్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు.
టీడీపీది కూడా రాజకీయ వారసత్వ కుటుంబమే !
పేర్ని నాని తండ్రికి రాజకీయ ప్రత్యర్ధిగా నడకుదుటి నరసింహారావు మచిలీపట్నం రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత ఆయన 1999లో పేర్ని నానిని కూడా ఓడించారు. నడకుదిటి రాజకీయ వారసత్వాన్ని మచిలీపట్నంలో ఆయన మేనల్లుడు కొల్లు రవీంద్ర కొనసాగిస్తున్నారు. 2009లో మొదటి సారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయని కొల్లు రవీంద్ర.. 2014లో పేర్ని నానిని ఓడించి చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. గత ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఓడిపోయిన ఆయన.. ఈ సారి పేర్ని మూడో తరం వారసుడితో పోటీ పడ్డారు.
పేర్ని నాని తీరుతో వ్యతిరేకత
వైసీపీ నుంచి పేర్ని కిట్టు మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి, తాత మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానిపై పెరిగిన ప్రజా వ్యతిరేకత కిట్టు విజయంపై ప్రభావం చూపిస్తోందన్న ప్రచారం జరుగుతోదంి. ఆ వ్యతిరేకత భయంతోనే పేర్ని నాని ఈసారి పోటీకి దూరమై.. కొడుక్కి అవకాశమిచ్చారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అదీకాక వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, అరాచకాలు , అక్రమాలు పెరిగిపోయి. పట్టణంలో ప్రశాంతత కరువైందన్న విమర్శలున్నాయి. పోలీసుల అండతో వైసీపీ శ్రేణులు ఇష్ఠానుసారం చెలాయించుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పేర్ని నాని వారసుడికి మొదటి సారి బ్యాడ్ లక్ తప్పదన్న వాదన వినిపిస్తోంది.