ఏపీ విద్యుత్ సంస్థల ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను భారీగా పెంచడంపై ఆయన మండిపడ్డారు.” గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అంతా అవినీతే. అన్నింటినీ సమీక్షించి విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గించేస్తాం ” అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార వేదికపై చెబితే అందరితో పాటు నేను కూడా అలాగే చేస్తారేమో అనుకున్నా.. కానీ నాలుగేళ్లు తిరిగే సరికి రివర్స్ టెండరింగ్ తరహాలో రివర్స్ పాలన చేస్తూ.. పూర్తిగా పెంచేశారు. ఇప్పటికే ఎడెనిమిది సార్లు విద్యుత్ చార్జీను సవరణ పేరుతో పెంచారు. ఇప్పుడు పెంచడం కాకుండా .. ట్రూ అప్ చార్జీ, ఇంధన సర్దుబాటు పేరుతో వినియోగదారులను బాదేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కో కుటుంబపై నాలుగేళ్లలో రెట్టింపైన విద్యుత్ భారం.
సగటున రెండు, మూడు వందల యూనిట్లు ఉపయోగించుకునే మధ్య తరగతి కుటుంబంపై కనీసం రూ. ఐదు వందల వరకూ భారంవేసేలా నాలుగేళ్లలో చార్జీలు పెంచడం అమానుషం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు పెంచి వినియోగం తగ్గిస్తానని జగన్ గారు మద్యం విషయంలో చెప్పేవారు. విద్యుత్ విషయంలో ముట్టుకోకపోయినా కరెంట్ షాక్ కొట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై రూ.2,900 కోట్ల మేర భారం వేశారు. ఇప్పుడు ఎఫ్‌పీపీసీఏ-ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఏకపక్షంగా ప్రతి నెలా యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేసుకునేలా నిర్ణయం తీసేసుకుని వసూలు కూడా ప్రారంభించారు. విధాన నిర్ణయాల పేరిట వివిధ రూపాల్లో అసలు చార్జీల కంటే.. అదనపు మొత్తాలనే డిస్కమ్‌లు అధికంగా వసూలు చేస్తున్నాయి. కరెంట్ బిల్లలో అసలు కరెంట్ వాడుకున్నందుకు రూ. 600 బిల్లు వస్తే.. ఇతర చార్జీల కింద రూ. 500 వరకూ అదనపు బిల్లు పడుతోంది. ఇది ప్రజల్ని నిలువు దోపిడీ చేయడం కాదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించాలా ?
డిస్కమ్‌లు సమర్పించిన 2023-24 వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలో 68,519 ఎంయూల విద్యుత్ వినియోగం జరుగుతుందని అంచనా వేశాయి. దీనిప్రకారం విద్యుత్ చార్జీలు కాకుండా అదనంగా యూనిట్‌కు 50 పైసలు చొప్పున సంవత్సరంలో రూ.3,425 కోట్ల సర్దుబాటు చార్జీల భారం పడుతుంది. అసలు ప్రజలపై ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు వేయడానికి కారణం అదనపు ఖర్చులు. ఈ ఖర్చులు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచడం ద్వారా రూ.16,000 కోట్లు ప్రజలపై భారం వేశారని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు వినియోగదారులపై చార్జీల భారం మోపుతూనే..మరో వైపు ఈ ఖర్చుల పేరుతో దోపిడీ చేయడం ఎందుకు. అసలు సొంత విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ నిలుపుదల చేసి బయట నుంచి కొనాల్సిన అవసరం ఏమిటి ? 2019-22 మధ్య కాలంలో జెన్కో విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలుపుదల చేసి బహిరంగ మార్కెట్లో రూ.12,200 కోట్ల విలువైన కరెంటు కొనుగోలు చేశారు. అత్యధికంగా రూ.21వరకూ చెల్లించి కొన్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల డిస్కమ్‌లకు రూ.6,000కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నిర్వాకానికి ప్రజలు ఎందుకు మూల్యం చెల్లిచాలని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల హామీ ప్రకారం విద్యుత్ చార్జీలు తగ్గించాల్సిందే !
అవసరం లేకపోయినా విద్యుత్ సంస్థల కోసం వచ్చే పదేళ్లకు సరిడేలా ట్రాన్స్ ఫార్మర్లు కొని గోడౌన్లలో వృధాగా పడేశారన్న ఆరోపణలు ఉన్నాయి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక సంస్థకు రూ.2,629 కోట్ల బిల్లులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి దుబారా ఖర్చులు ఎన్ని చేశారో.. ఇంకా బయటకు రావాల్సి ఉన్నాయి. డిస్కమ్‌లు ఇబ్బడి ముబ్బడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నా.. అవసరం లేకున్నా పరికరాలు వృథా వ్యయం చేస్తున్నా నివారించకపోగా.. ఆ భారాన్ని ప్రజలపైనే రుద్దుతున్నారు. *అసలు మొత్తం విద్యుత్ సంస్థల ఆర్థిక వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. *ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బయట నుంచి కొనుగోలు చేసిన విద్యుత్.. వాటికి చెల్లించిన ఖర్చులు, కొన్న ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర ఖర్చులు పూర్తి వివరాలు బయటపడెతే.. అసలు విద్యుత్ సంస్థల సొమ్మును ఎవరు మింగుతున్నారో అర్థం అయిపోతుంది. ప్రజల్ని దోపిడీ చేయడానికే అవకాశం ఇచ్చినట్లుగా పాలకులు భావిస్తే అంతకు మించిన తప్పిదం మరొకటి ఉండదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తక్షణం కరెంట్ వాడుకున్న చార్జీలు మినహా ఇతర చార్జీలన్నింటినీ తీసేసి .. ప్రమాణస్వీకారంలో హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ చార్జీలనుపూర్తిగా తగ్గించాలని సీఎం జగన్ ను డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఏపీ బీజేపీ విద్యుత్ ఉద్యమం చేపట్టి.. ప్రభుత్వాన్ని ఇంటికి పంపేవరకూ పోరాడుతామని హెచ్చరించారు.