మిత్రధర్మం తప్పని బీజేపీ – జనసేన ఆత్మ పరిశీలన చేసుకుంటుందా ?

భారతీయ జనతా పార్టీ మిత్రుల విషయంలో ధర్మం తప్పడం లేదు. 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ , పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరు కానున్నారు. బీజేపీతో పొత్తులో జనసేన చాలా కాలంగా ఉంది.

జనసేనను నమ్మకమైన మిత్రపక్షంగానే చూస్తున్న బీజేపీ !

జనసేన పార్టీని తమతో కలిసి రావాలని బీజేపీ అడగలేదు. పవన్ కల్యాణ్ మొదట ఎన్డీఏలో చేరారు. తర్వాత వెళ్లిపోయారు. మళ్లీ ఆయనే వచ్చి ఎన్డీఏలో చేరుతామన్నారు. బీజేపీ అంగీకిరంచింది. అయితే పొత్తులు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఈ నాలుగేళ్ల కాలంలో ఏం చేశారన్నది చూస్తే.. అసలు కలిసి పని చేయడానికి ఆయన ముందుకు రాలేదు . ఎప్పుడూ రాష్ట్ర నాయకత్వంతో పని చేయడాన్ని ఆయన నామోషీగానే భావించారు. ఫలితంగా పొత్తులు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

బీజేపీనే ఎదురు నిందిస్తున్న పవన్

ఇటీవల ఓ సమావేశంలో.. బీజేపీ సీరియస్ గా ఉండి ఉంటే… వేరే పార్టీతో పొత్తుల గురించి ఆలోచన చేసే అవసరం ఉండేది కాదని పవన్ వ్యాఖ్యానించారు. నిజానికి అలా చేయాల్సింది పవన్ కల్యాణే. బీజేపీ నాలుగేళ్లుగా ప్రజల్లోకి వెళ్తూనే ఉంది.కానీ పవన్ మాత్రం తన పార్టీని పెద్దగా ముందుకు తీసుకెళ్లలేదు. కార్యక్రమాలు నిర్వహించలేదు. ఏపీ బీజేపీ నాయకత్వంపై ఇతరులు వైసీపీకి అనుకూలం అనే ముద్ర వేస్తే.. దాన్ని ఆయన నమ్మి దూరంగా ఉండిపోయారు. రాజకీయల్లో వైఫల్యం ఇలాగే వస్తుంది. నిజంగా పవన్ నాలుగేళ్లుగా ప్రభుత్వంపై పోరాటానికి కలిసి వస్తే.. ఇప్పుడు మరో పార్టీ అవసరం ఉండేది కాదన్నబీజేపీ అభిప్రాయం.

ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారా ?

జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో కలిసి పని చేయడం లేదు. పొత్తులో ఉన్నామని అంగీకరిస్తోంది. ఎన్డీఏ సమావేశానికి పిలువగానే వెళ్తున్నారు. మరి పొత్తులో ఉన్నామనుకున్నప్పుడు… రాష్ట్రంలో కూడా కలిసి పని చేయాలి కదా అంటే.. స్పందన ఉండదు. ఇలాంటి పొత్తుల వల్ల ప్రయోజనాలు ఉండవు. కలిసి పని చేసి పరస్పర ప్రయోజనాలు పొందాలనకుుంటనే.. ఉపయోగం.. కానీ పవన్ మాత్రం.. అర్థం కాని రాజకీయం చేస్తూ… ఆయన పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు.. బీజేపీని టార్గెట్ చేస్తూ రాజకీయానికి అర్థం తెలియదన్న అభిప్రాయం వచ్చేలా చేసుకుంటున్నారు.