నితీశ్ కుమార్ యూపీకి మారతారా – ఎందుకంత భయం…

రాజకీయ అవకాశవాదిగా గట్టి ముద్ర పడిపోయిన నితీశ్ కుమార్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. బీజేపీని అవసరానికి వాడుకుని తర్వాత ఆర్జేడీతో చేతులు కలిపిన ఆయన ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు పుట్టగతులుండవని భయపడుతున్న ఆయన ముందే కొట్టు కట్టేసి లోక్ సభ బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఏదో విధంగా రాజకీయ మనుగడ సాగించేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారు.

ఫుల్పూర్ నుంచి పోటీ చేస్తారా ?

పొత్తు భాగస్వాముల కంటే నితీశ్ పార్టీకి తక్కువ సీట్లు ఉంటాయి. ఒక సారి బీజేపీ కూడా తమకు ఎక్కువ సీట్లున్నా నితీశ్ కే ముఖ్యమంత్రి పదవిని వదిలేసింది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా నితీశ్ అవసరాన్ని బట్టి ఆర్జేడీ నుంచి బీజేపీ, మళ్లీ బీజేపీ నుంచి ఆర్జేడీ తిరిగేస్తుంటారు. ఇప్పుడాయని తన అనుచరులతో కొత్త ప్రతిపాదన చేయించుకుంటున్నారు. యూపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆయన జేడీయూ యూపీ శాఖ వారితో చెప్పించుకుంటున్నారు. ఒక పక్క తనకు ప్రధాని కావాలన్న కోరిక లేదని చెబుతూనే లోక్ సభ బరిలోకి దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఫుల్పూర్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని యూపీ శాఖ నుంచి విజ్ఞప్తి వచ్చింది. బిహార్లో నితీశ్ కేబినెట్ సభ్యుడైన శ్రవణ్ కుమార్ కూడా అలాంటి ప్రతిపాదనే చేశారు.

వారణాసికి దగ్గరగా నియోజకవర్గం..

ఫుల్పూర్ ఒకప్పుడు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం విశేషం. తర్వాత అక్కడ కాంగ్రెస్ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో కొంత భాగం ఫుల్పూర్ కిందకు వస్తుంది. పైగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి నియోజకవర్గం ఫుల్పూర్ కు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నితీశ్, ఫూల్పూర్ నుంచి పోటీ చేయాలనుకోవడానికి కుల సమీకరణాలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఆయన కుర్మీ సామాజికవర్గానికి చెందిన నేత కాగా, ఆ కులస్తులు ఫుల్పూర్ లో ఎక్కువగా ఉన్నారు.

ఆర్జేడీ తరుముతోందా….

నితీశ్ కుమార్ ను ఆర్జేడీ బిహార్ నుంచి తరమేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ప్రజామద్దతు క్రమంగా తగ్గుతోంది. దాన్ని అవకాశంగా తీసుకుని వచ్చే ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సీఎం వదవి తనకు కావాలని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ భీష్మించుకు కూర్చున్నారు. ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండటంతో బిహార్లో నితీశ్ ఒంటరివాడైపోయారు. పైగా ఇటీవల విపక్షాల కూటమికి ఇండియా అన్న పేరు పెట్టడంపై నితీశ్ అలిగి వెళ్లిపోయినా వాళ్లెవ్వరూ పట్టించుకోలేదు. పోతే పోనీ అన్నట్లుగా ఊరుకున్నారు. దానితో బిహార్ రాజకీయాలపై నితీశ్ పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. పక్క రాష్ట్రానికి పోయి సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారు.