జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన సీఎం హేమంత్ సోరెన్ కు రాజీనామా చేయాల్సిన అనివార్యత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఆయన తగిన ఏర్పాట్లలో తలమునకలై ఉన్నట్లు చెబుతున్నారు…
ముందస్తుగా ఓ ఎమ్మెల్యే రాజీనామా..
జేఎంఎంకు చెందిన ఓ ఎమ్మెల్యే అకస్మాత్తుగా రాజీనామా చేశారు. గాండే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే సర్ఫరాజు అహ్మద్ రాజీనామా చేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. జేఎంఎంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించారు. తమ సీఎం హేమంత్ సోరెన్ శక్తిమంతుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే అసలు కారణంగా సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను పోటీ చేయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, పార్టీ ఒత్తిడి మేరకే సర్ఫరాజ్ రాజీనామా సమర్పించినట్లు వార్తలు వచ్చాయి.
ఎన్నికలు జరగడం అనుమానమేనా…
సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేసినప్పటికీ ఎన్నికలు జరగడం అనుమానమేనన్న వార్తలు వినిపిస్తున్నయి. ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీ 2019 డిసెంబరు 27న ఏర్పాటైంది. సర్ఫరాజ్ 2023 డిసెంబరు 31న రాజీనామా చేశారు. అంటే ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉంది. ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది..
తరుముకొస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు
జేఎంఎం తీరుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అవినీతి కేసులో నిందితుడైన సీఎం హేమంత్ సోరెన్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఈడీ సమన్లను ధిక్కరించారు. హాజరు కాకుండా ఉండేందుకు ఆయన వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దానితో ఈడీ ఇప్పుడు ఏడో సారి ఆయనకు సమన్లు జారీ చేసింది. పదే పదే హాజరు నుంచి తప్పించుకోవడం సహేతుకం కాదని ఈడీ హెచ్చరించింది. నోటీసులు అందిన వారం లోగా ఎప్పుడు హాజరయ్యేదీ తమ కార్యాలయానికి సమాచారం పంపాలని సూచించింది. దానితో ఈ సారి హాజరు కాక తప్పదని, ఈడీ తనను అరెస్టు చేస్తుందని హేమంత్ సోరెన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భార్యను సీఎం పీఠంపై కూర్చోబెడితే కుటుంబ అధికారానికి ఢోకా ఉండదని విశ్వసిస్తున్నారు. ముందు కల్పనా సోరెన్ ను సీఎం సీటుపై కూర్చోబెడితే తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నుకునే ఏర్పాట్లు చేసే వీలుంటుందని అంచనా వేసుకుంటున్నారు. బీజేపీ మాత్రం జేఎంఎం పప్పులు ఉడకవని….ఎన్నికలు జరిగితే తామే గెలుస్తామని చెప్పుకుంటోంది. ఇక మొత్తం విషషమేమిటంటే..సీఎం హేమంత్ సోరెన్ తనకు తానే ఆమధ్య ఓ మైనింగ్ లీజు ఇచ్చుకున్నారు… మైనింగ్ శాఖ కూడా తన దగ్గరే ఉంది… మైనింగుకు పర్యావరణ, అటవీ క్లియరెన్సులు ఇచ్చుకున్నారు… ఆ శాఖ కూడా తన దగ్గరే ఉంది… సీఎం తన భార్య కల్పనకు కూడా ఓ ఇండస్ట్రియల్ కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు… సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, ప్రెస్ అడ్వయిజర్ అభిషేక్ ప్రసాద్ కూడా మైనింగ్ లీజులు పొందారని బీజేపీ ఆరోపణ… హైకోర్టులో కేసు పడింది… అడ్వొకేట్ జనరలే స్వయంగా ‘మిస్టేక్ జరిగింది’ అని అంగీకరించారు…ఇప్పుడేం జరుగుతుందో చూడాలి..