గోపీచంద్ రామబాణం ఈసారైనా హిట్ కొడుతుందా?

హీరో అనే మాటకు పర్యాయ పదంలా ఉంటాడు మ్యాచో స్టార్ గోపీచంద్. ఆరడుగుల హైట్, అద్భుతమైన ఫిజిక్ తో కమర్షియల్ సినిమాకే అమ్మా మొగుడిలా కన్పిస్తాడు. దీనికితోడు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయినా కూడా తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు గోపీచంద్. గోపీకి హిట్ వచ్చి దాదాపు ఆరేళ్లు దాటిపోయింది. కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా చెప్పుకున్న పక్కా కమర్షియల్ కూడా గోపీచంద్ ఫ్లాపులకు అడ్డుకట్ట వేయలేకపోయింది. ఇక అంతకుముందు చేసిన చాణక్య, సీటీమార్, ఆరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలు ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాయి. అవి వచ్చిన సంగతి కూడా ఆడియన్స్ కు గుర్తులేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ.. గోపీచంద్ రేంజ్ కు తగ్గ హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు.
హ్యాట్రిక్ కోసం..
ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో రామబాణం అనే సినిమా చేశాడు గోపీచంద్. ఇది పక్కా ఎంటర్ టైన్ మెంట్ మూవీ. గతంలో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయ. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి రామబాణం సినిమా చేశారు. ఇందులో గోపీచంద్ సరసన డింపుల హయతి హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అటు దర్శకుడిగా శ్రీవాస్ కు కూడా చెప్పుగోదగ్గ హిట్ లేదు. దీంతో.. ఇద్దరూ కలిసి ఇప్పుడు రామబాణం తమ ప్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారు.
సెంటిమెంట్ కూడా..
ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవే లేదు. నమ్మాలే కానీ ఇక్కడ ప్రతీది సెంటిమెంటే. అలాంటి సెంటిమెంటే హీరో గోపీచంద్ కు ఉంది. తన సినిమా పేరు చివర్లో సున్నా వస్తే హిట్ గ్యారంటీ అని బలంగా నమ్ముతాడు గోపీ. జయం, వర్షం, యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం, శంఖం, సాహసం , లౌక్యం అని.. ఇలా చాలా సినిమా పేర్లకు చివర సున్నా వచ్చేలా చూసుకున్నాడు. అయితే ఈ సెంటిమెంట్ చాలాసార్లు వర్కవుట్ అయ్యింది. దీంతో.. ఇప్పుడు శ్రీవాస్ డైరెక్షన్ లో చేసిన రామబాణం సినిమాకు కూడా చివర సున్నా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. మరి ఈ రామబాణం సినిమాతో అయినా సూపర్ హిట్ కొట్టి తమ ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు గోపీ. రామబాణం సినిమా మే5 విడుదల అవుతుంది.
స్టీరియో టైప్ సినిమాలు
హైట్, ఫిజిక్ పక్కాగా ఉన్నా… సినిమా కథల విషయంలో మాత్రం గోపీచంద్ చాలా వెనకబడిపోయాడు. ఎప్పుడూ అవే రొడ్డుకొట్టుడు సినిమాలు, నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, ఆరు కామెడీ సీన్లు ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ ఉంటాడు. తనకన్నా వెనక వచ్చిన నాని లాంటి కుర్ర హీరోలు సరికొత్త కథలతో దూసుకెళ్తున్నారు. కానీ గోపీచంద్ పరిస్థితి మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లు తయారైంది. అందరి హీరోల్లా అన్ని సినిమాలూ చేయాలి, ప్రయోగాలు చేయాలి, అప్పుడే హిట్ అందుకోగలడు గోపీచంద్.