బాలినేని వైసీపీలోనే ఉంటారా ?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి .. వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలపై చర్చించారు. కానీ ఈ భేటీపై ఆయన అంత సంతృప్తిగా కనిపించలేదు. మీడియాకు పొడిపొడిగానే సమాధానం ఇచ్చారు. పార్టీ మార్పు వార్తలను కూడా గట్టిగా ఖండించలేదు. ప్రచారం జరుగుతోందని.. దానికి తానేం చేస్తానంటున్నారు. కానీ ఆయన ఇటీవల తాను పాల్గొనే కార్యక్రమాల్లో వైసీపీ జెండాలు లేకుండా చూసుకుంటున్నారు. జగన్ ఫోటోలను కనిపించనీయడం లేదు.

ప్లాన్డ్ గా నిర్వీర్యం చేశారనుకుంటున్న బాలినేని

జగన్ మళ్లీ పిలవడంతో ప్రకాశం జిల్లా మొత్తాన్ని చేతిలో పెడతారని అనుకున్నారు. కానీ జగన్ అలాంటి హామీలేమీ ఇవ్వలేదు. ప్రోటోకాల్ గురించి కూడా చెప్పలేదు. దీంతో జిల్లాలో తాను ఎదుర్కొంటున్నా ఇబ్బందుల పై కూడా సీఎం కి వివరించాననని.. ప్రోటోకాల్ అనేది పెద్ద విషయం కాదన్నారు. ప్రోటోకాల్ పై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందని నిర్వేదంగా మాట్లాడారు బాలినేని. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవి కూడా చర్చ జరగలేదు. ..గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశా.. నియోజకవర్గ మిడ్ దృష్టి పెట్టమన్నారని చెప్పుకొచ్చారు. అంటే నియోజకవర్గానికే పరిమితమవ్వు అప్పుడు ఇతరులతో సమస్యలు రావని చెప్పినట్లయిందని అంటున్నారు.

విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ !

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. నెల్లూరులో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, చిత్తూరు, కడపలో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉందని చెప్పలేం. కుప్పంని కూడా టార్గెట్ చేసి చిత్తూరులో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న జగన్, అక్కడ ఇన్ చార్జ్ కాస్త గట్టిగా పని చేయాలనుకుంటున్నారు. ఇటీవల ఆ మూడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దీంతో జగన్ మరింత కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. విజయసాయికి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు.

జనసేన, బీజేపీ కూటమి వైపు బాలినేని చూపు ?

జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసే అవకాశాలు ఉండటంతో… బాలినేని అ రెండు పార్టీల్లో ఒక దానిపై చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో జనసేనలో చేరుతారన్న ప్రచారం గుప్పుమంది. కానీ ఖండించారు. ఇప్పుడు పరిస్థితులు నిజంగానే ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన దిశగా పురికొల్పుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.