ఏపీలో రాజకీయ పరిస్థితులు బీజేపీకి అనుకోని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అవినీతి కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం… లోకేష్ కూడా అరెస్ట్ భయంతో ఢిల్లీలోనే ఉంటూండటంతో ఏపీలో నాయకత్వ సమస్య ఏర్పడింది. చివరికి ఆ పార్టీకి దశాదిశా లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నాయకుల్ని ఆకర్షించి … పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఏపీ బీజేపీకి వచ్చినట్లయింది. మరి ఈ విషయంలో బీజేపీ అలాంటి అవకాశాల్ని అంది పుచ్చుకుంటుందా అన్నది కీలకంగా మారింది.
అవకాశాలు ఎప్పుడూ రావు.. రాజకీయాల్లో కూడా !
అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే వాళ్లకే అదృష్టం కలిసి వస్తుంది. రాజకీయాల్లో అయితే మంచి చెడూ కూడా చూసుకోకుండా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి. లేకపోతే… ఎప్పటికీ విఫల నేతగానే ఉంటారు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి అలాంటి అవకాశం వచ్చింది. టీడీపీ సంక్షోభంలో పడింది. ఇలాంటి సందర్భంలో .. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ కి మంచి అవకాశం వచ్చింది. దూకుడుగా రంగంలోకి దిగి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడి… టీడీపీ నేతల్ని.. క్యాడర్ ని ఆకర్షిస్తే బీజేపీ బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
జనసేన టీడీపీ వైపు వెళ్లిపోవడం మైనస్
చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత జనసేన పార్టీ బీజేపీతో సంబంధం లేకుండా…. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి ఉంటే.. బీజేపీ, జనసేన మంచి పొజిషన్ లో ఉండేవి. ప్రత్యామ్నాయ కూటమిగా ఉండేది. ఇలాంటి రాజకీయాల్ని పవన్ కు విడమర్చి చెప్పడంలో బీజేపీ నాయకత్వం విఫలం అయింది. పవన్ కు ఉన్న రాజకీయ అవగాహనకు ఆవేశం ఉంది కానీ.. ఆలోచన లేదని.. ముందుగానే గ్రహించి.. రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేసి ఉన్నట్లయితే పరిస్థితి మారేదని అంటున్నారు.
ఏపీ బీజేపీ నాయకత్వం కార్యాచరణే కీలకం
ఏపీ బీజేపీ నాయకత్వం కార్యచరణ… క్యాడర్ అంతా రంగంలోకి దిగేలా చేయడం కీలకం. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం స్కాం పేరుతో ఉద్యమం ప్రారంభించారు. అలాగే సీనియర్ నేతలు సహా అందర్నీ కలుపుకుని రంగంలోకి దిగితే.. మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ అనుకంటున్నారు. కానీ ఇలాంటి అవకాశాన్ని అంది పుచ్చుకుంటారా లేదా అన్నదానిపై మాత్రం … బీజేపీలోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.