సంక్షేమంతో పాటు సంకల్పం – తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఎవరూ ఊహించని అంశాలు

మేనిఫెస్టో అంటే ఉచిత పథకాలు కూర్చడమని అన్ని రాజకీయ పార్టీలు అనుకుంటూ ఉంటాయి. కానీ మేనిఫెస్టో అంటే సంక్షేమంతో పాటు సంకల్పం అని బీజేపీ నిరూపించబోతోంది. బీజేపీ మేనిఫెస్టో ఇతర పార్టీలతో పోలిస్తే భిన్నంగా ఉండనుంది. ఈ నెల 17వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యాటనకు రానున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

ఏ మాత్రం తగ్గని సంక్షేమం

మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయన్నదానిపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తి ఏర్పడింది. తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. విద్య, వైద్యం ఉచితంగా అందించే హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. మేనిఫెస్టోలో జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. సకల జనుల సంక్షేమం కోసం కేంద్రం సహకారంతో భారీ పథకాలు అమలు చేయనున్నారు. ఇందు కోసం భారీ కసరత్తు జరిగింది.

తెలంగాణ అస్తిత్వం కోసం పలు నగరాల పేర్ల మార్పు

తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. భైంసా పేరును మహీషగా మారుస్తామని కూడా ఆయన చెప్పారు. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ పేరు మార్పు డిమాండ్లన్నీ ఇప్పుడు మేనిఫెస్టో హామీలుగా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేర్లు మార్చాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. వాటిని బీజేపీ తీర్చేందుకు సిద్ధమైంది. మేనిఫెస్టోలో పెట్టనుంది. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌ గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌ గా పేరు మార్చింది.

సంక్షేమం – తెలంగాణం కలిసేలా మేనిఫెస్టో

తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కానీ గత పదేళ్లలో తెలంగాణ పాలకులు.. ప్రజలు కోరుకున్న పాలనను మాత్రం అందించలేదు. పెద్ద ఎత్తున అవినీతి కి పాల్పడ్డారు. ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయారు. ఒకరిద్దరికి పథకాలు ఇచ్చి ఎక్కువ మందిని మోసం చేశారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా… సంక్షేమంతో పాటు ప్రత్యకమైన తెలంగాణ వాదం కనిపించేలా మేనిఫెస్టో సిద్ధం చేయనున్నారు. పదిహేడో తేదీ తర్వతా బీజేపీ మేనిఫెస్టోపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది.