శ్రీ మహాలక్ష్మీని 8 రూపాల్లో పూజిస్తారెందుకు!

హిందూ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మిని భోగభాగ్యాలను అధిష్టాన దేవతగా పూజిస్తారు. ఈమెను 8 రూపాల్లో పూజిస్తారు. ఆ రూపాలేంటి.. వాటివెనుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

1.ఆదిలక్ష్మి
ఆదిలక్ష్మిని ‘మహాలక్ష్మి’ అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఓ చేతిలో పద్మం, మరో చేతిలో పతాకం ధరించి..రెండు చేతుల్లో అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. లోకాలను కాచే ఆదిలక్ష్మి ప్రాణశక్తికి, ఆరోగ్యానికి అధిష్టాన దేవత.

2.ధాన్యలక్ష్మి
పంటలు సమృద్ధిగా పండి ధాన్యపు రాశులు కురిస్తే అందరి జవితాలూ సుభిక్షంగా ఉన్నట్టే. ఇదంతా కాచేతల్లి ధాన్యలక్ష్మి. ఆహారానికి ప్రతీకగా ఉండే ధాన్యలక్ష్మి ఆకుపచ్చని రంగులో, ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల, రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించేతల్లిగా ధాన్యలక్ష్మిని కొలుస్తారు.

3.ధైర్యలక్ష్మి
ధైర్యలక్ష్మి తోడుంటే జీవితంలో అపజయం అనేదే ఉండదంటారు. ఈమెనే ‘వీరలక్ష్మి’ అని కూడా అంటారు. ఎర్రని వస్త్రాలు ధరించి..8 చేతుల్లో చక్రం, శంఖం, ధనుర్బాణం, త్రిశూలం, పుస్తకం, వరదాభయ ముద్రలలో దర్శనమిస్తుంది. మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి.

4.గజలక్ష్మి
సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు.. ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ అందించేతల్లి గజలక్ష్మి. నాలుగు చేతులు కలిగిన ఈ అమ్మవారిని ఇరువైపులా రెండు ఏనుగులు అభిషేకిస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించిన గజలక్ష్మి రెండు చేతుల్లో పద్మాలు, మరో రెండు చేతుల్లో వరదాభయ ముద్రలతో దర్శనమిస్తుంది. సకల శుభాలకు అధిష్టాన దేవత ఈమె.

5.సంతానలక్ష్మి
సకల సంపదలు, భోగభాగ్యాలున్నా సంతానం లేకపోతే అవన్నీ వృధాగానే అనిపిస్తాయి. ఆరు చేతులతో రెండు కలశాలు, ఖడ్గము, డాలు ధరించి, ఓ చేతిలో అభయముద్ర, మరో చేతిలో బిడ్డను పట్టుకుని దర్శనమిస్తుంది. సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.

6.విజయలక్ష్మి
ఏ కార్యం చేపట్టినా తమకు విజయాన్ని అందించమంటూ విజయలక్ష్మిని వేడుకుంటారు. ఎర్రని వస్త్రాలతో శంఖం, చక్రం,ఖడ్గం, డాలు పాశము, రెండు చేతుల వరదాభయ ముద్రలతో కనిపిస్తుంది. సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత.

7.విద్యాలక్ష్మి
ఈమెని సరస్వతీదేవికి ప్రతిరూపంగా కూడా అనుకోవచ్చు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించి పద్మపు సింహాసనంలో ఆసీనురాలై ఉంటుంది. విద్య, వివేకాన్ని అందించే దేవత విద్యాలక్ష్మి

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.