దీపావళి పండుగ అంటే దీపోత్సవం. ఈ రోజు లోగిలిలు అన్నీ దీపకాంతులతో కళకళలాడుతుంటాయి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది దీపావళి. అసలు దీపావళి ఎందుకు జరుపుకోవాలంటే…
ఆశ్వయుజాన్ని శక్తి మాసం అంటారు. ఈ నెల శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. అధర్మంమీద ధర్మం విజయకేతనం ఎగురవేసే మాసం ఇది. తొలి పది రోజులూ జగజ్జనని విజయశంఖారావం చేస్తే..మాసాంతంలో చతుర్దశిరోజు సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు నరకాసుర సంహారంచేసి విజయదుందుభి మోగిస్తాడు. లోకకంటకులైన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలూ ఆనంద దీపాలు వెలిగించిన మాసం ఇది. ఇవి మాత్రమే కాదు దీపావళి పండుగ వెనుక ఎన్నో ప్రత్యేకతలు…
త్రేతాయుగంలో
రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతాసమేతుడై.. ఈ ‘దీపావళి’ రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా అయోధ్య వాసులు శ్రీరాముడికి దీపాలవరుసతో స్వాగతం పలికి..సంతోషంగా బాణసంచా కాల్చారు
ద్వాపరయుగం
జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం చూసి అనంతరం అజ్ఞాతవాసం ముగించుకుని పాండవులు తిరిగి హస్తినకు వచ్చిన రోజు దీపావళి.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి ధన త్రయోదశి , ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి, ఆశ్వయుజ అమావాస్య దీపావళి, కార్తీక శుద్ధ పాడ్యమి గోవర్థన పూజ, కార్తీక శుద్ధ విదియ భగినీ హస్తభోజనం…ఈ ఐదు పండుగలు కలిపితేనే దీపావళి పూర్తవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ ఐదు పండుగలు జరుపుకుంటారు కానీ దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, భగినీ హస్తభోజనం జరుపుకుంటారు.
కేరళీయులు ఈ ‘దీపావళి’ పండుగను ‘బలి అమావాస్య’గా జరుపుకుంటారు
అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఈ పండుగను ‘జగద్ధాత్రి పూజ’గా జరుపుకుంటారు. బెంగాల్ లో ‘కలిపూజ’ చేస్తారు
ఒరిస్సాలో ఈ పండుగను ‘కుమార పూర్ణిమ’గా నిర్వహిస్తారు
తమిళనాడులో దీపావళిని పొద్దున్నే సెలబ్రేట్ చేసుకుంటారు
కర్నాటకలో మొదటి మూడు రోజులు దీపావళి పండుగ జరుపుకుంటారు
రాజస్థాన్ రాష్ట్రంలో ధనత్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు
గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రకరకాల పిండివంటలతో ‘లక్ష్మీపూజ’ చేస్తారు
దీపావళి అంటేనే ఆనందం..చిన్నా పెద్దా అందరూ కలసి సేఫ్ గా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ..దీపావళి శుభాకాంక్షలు