పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం. ఓంకారం సర్వమంత్రాలకూ అధిపతి అని పవిత్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓంకారమే బ్రహ్మజ్ఞానం. అదే పరమాత్మ. ఓంకార ఉచ్ఛారణ శరీరం మీద, మనస్సు మీద, పరిసరాల మీద ప్రగాఢమైన ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. అందుకే ఏ మంత్రం అయినా, వేదం అయినా, ఏ శుభకార్యం అయినా ప్రారంభమయ్యేది ఓంకారంతోనే.
‘అ’ కార, ‘ఉ’ కార, ‘మ’కారాల సమ్మేళనం ‘ఓం’కారం
తొలి – వేదమైన ఋగ్వేదంలోని మొదటి మంత్రం మొదటి అక్షరం (అ) ను రెండో వేదమైన యజుర్వేదంలోని మధ్య మంత్రంలోని మధ్యాక్షరం (ఉ)తో కలిపితే, ‘అ + ఉ = ఓ’ అవుతుంది. దానికి (ఓ), చివరి వేదమైన సామవేదంలోని చివరి అక్షరాన్ని (మ్) జత చేరిస్తే, మొత్తం కలిపి మూడు వేదాల సారమే – ‘ఓమ్’. అందుకే ‘ఓమ్’ అని ఉచ్చరిస్తే మూడు వేదాలనూ ఉచ్ఛరించినట్టే. అందుకే ఏ నామానికైనా ముందు ‘ఓంకారం’ చేరిస్తే, అది వేదమంత్రంతో సమానం అవుతుంది. ‘ఓమ్’ అనేది అన్ని మతాలకూ, ధర్మశాస్త్రాలకూ మూలం లాంటిది. అందులోని ‘అ’కారం అశ్వం లాగా మానవాళిని మోసుకు వెళుతుంది. ఇక, ‘ఉ’కారం స్థలాన్నీ, పరిస్థితినీ సూచిస్తుంది. ‘మ’కారం జీవితంలోని లయకూ, శ్రావ్యతకూ సూచిక.
మూడు అవస్థలకు ప్రతీక ‘ఓం’
ఓంకారంలోని ఈ మూడు అక్షరాలూ జాగృతి , స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకూ ప్రతీకలు. అలాగే, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులకూ, మూడు వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలకూ అవి సంకేతాలు. ప్రపంచానికి ఆధారభూతులు సృష్టికర్త (అ = (బ్రహ్మ), స్థితికారకుడు (ఉ = విష్ణువు), లయకర్త (మ్ = శివుడు) అయిన త్రిమూర్తి సంకేతం ఓం. రూపరహితుడూ, గుణ రహితుడూ అయిన బ్రహ్మ స్వరూపమే! న భగవంతుణ్ణి స్తుతించే శబ్దం కావడంతో, ఓంకారాన్ని ‘ప్రణవం’ అని పేర్కొంటారు.
భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో ఓంకారోపాసనా విధానం గురించి ఇలా ఉంది
సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ |
మూర్థ్యాధాయాత్మనః ప్రాణ ఆస్ధితో రాణామ్ ||
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ |
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాంగతిమ్ ||
ఎవరు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకుని, ప్రాణవాయువును శిరస్సులో ఆరోహణం కావించి యోగధారణతో పర బ్రహ్మకు వాచకమైన ‘ఓం’ అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మనైన నన్ను ధ్యానిస్తూ దేహాన్ని త్యజిస్తాడో వాడు సర్వోత్కృష్టమైన మోక్షం పొందుతాడు” అని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.