ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీరు కాకపోతే నేను అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయి కానీ మూడో పక్షానికి అవకాశం ఇవ్వడం లేదు. కానీ బీజేపీ – జనసేన కూటమి విస్తృతంగా ప్రయత్నిస్తోంది. అయితే మారుతున్న రాజకీయాలతో..భారతీయ జనతా పార్టీ తనదైన వ్యూహాలతో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. టీడీపీ, వైసీపీ మాత్రమే కాదు.. వై నాట్ బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. ప్రజల్లో నిజంగా ఇలాంటి భావన కల్పిస్తే.. బీజేపీ దశ తిరిగినట్లే అనుకోవచ్చు.
మొదటి నుంచి జాతీయ బీజేపీ ప్రస్థానంలో ఏపీ పార్టీది కీలక పాత్ర!
నాలుగు దశాబ్దాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏపీ బీజేపీ చాలా కీలక పాత్ర పోషించింది. బీజేపీ మొదటి సారి గెల్చుకున్న రెండు సీట్లలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలోనిదే. అయితే ఆ తర్వాత కేంద్రంలో ఎదగడానికి ఏపీ కీలకంగా మారింది. కానీ త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని.. కూటములే ప్రభుత్వాలు ఏలే రోజుల్లో.. ఏపీబీజేపీ త్యాగాలు చేసి..ఢిల్లీలో ప్రభుత్వాలన నిలబెట్టింది. ఫలితంగా ఏపీ నుంచి జాతీయ నేతలు వచ్చారు కానీ.. సంస్థాగతంగా బీజేపీ బలపడలేకపోయింది. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. కేంద్ర బీజేపీకి ఏపీ ఇస్తున్న సహకారం కారణంగా.. కొన్ని పరిమితులు వల్ల… ఎదగడానికి సమస్యలు ఏర్పడుతూ వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏపీలో చాలా కాలంగా కేంద్ర పార్టీ కోసం త్యాగాలు చేస్తూ ఉంది. ఢిల్లీలో అధికారం కోసం ఏపీ ఎప్పుడూ కీలకమే.
వ్యూహాత్మకంగా బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్న ప్రాంతీయ పార్టీలు
ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలే ఉండటం కూడా బీజేపీకిమైనస్ గా మారింది. రెండు ప్రాంతీయ పార్టీలు.. తమ రాజకీయ అవసరాల కోసం కేంద్రంలో ఉన్న బీజేపీతో సన్నిహితంగా ఉంటుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్రం కూడా ప్రభుత్వాలకు సహకరించాల్సి ఉంది. ఇలాంటి సహాకారం పొందుతున్న పార్టీలు.. తాము బీజేపీకి సన్నిహితమని.. తాము, బీజేపీ ఒకటేనని ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ ప్రభావం ఏపీ బీజేపీపై తీవ్రంగా పడుతోంది. గతంలో టీడీపీతో పొత్తు ఉండటం.. ఇప్పుడు వైసీపీతోపొత్తు లేకపోయినా ఆ పార్టీ బీజేపీకి దగ్గరగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో ఆ రెండు పార్టీలు ఒకటే అన్న భావన వస్తోంది. ఇది ఏపీ బీజేపీ ఎదుగుదలపై కీలక ప్రభావం చూపిస్తోంది.
ప్రాంతీయ పార్టీల కుట్రల్ని చేధించి.. ఇక వై నాట్ బీజేపీ నినాదం !
వైసీపీ, టీడీపీ ఎన్ని సీట్లు గెల్చినా బీజేపీకే మద్దతిస్తాయన్న ఓ ప్రచారాన్ని ఇప్పటికీ ఉద్దృతంగా చేస్తున్నారు. దీన్ని నిలువరించి.. సొంతంగా ఎదగడానికి బీజేపీ కార్యాచరణ ఖరారు చేసుకుంది. గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పై చేయాల్సిన పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని బీజేపీ నేతుల అంచనాకు వచ్చారు. ఈ సారి గేమ్ తమదే అవుతుందని.. ఖచ్చితంగా వై నాట్ బీజేపీ అంటూ ప్రజల్లోకి వెళ్లి.. మోదీ ప్రభుత్వ విజయాలను.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆవశ్యకతను గుర్తించి.. ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఏపీ బీజేపీ నేతల ప్రయత్నాల్లో ఎంత చిత్తశుద్ధి ఉంటే.. అంత బాగా పార్టీ పరిస్థితి మెరుగవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.