మనకున్న ఏడుకోట్ల మహామంత్రాల్లో రెండక్షరాల “రామ” మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతిలో ఉంది. ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువు, శివుడు కలిస్తే ఏర్పడిన దివ్యమంత్రం.
‘ఓం నమోనారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలో “రా” అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలోంచి ‘రా’ తొలగిస్తే ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది. ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంలో “మ” అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో ‘మ’ తొలగిస్తే నశ్శివాయ అవుతుంది. అంటే శివుడే లేడని అర్ధం.ఈ రెండు జీవాక్షరాల సమాహారమే “రామ”. శివకేశవుల సంఘటిత శక్తియే ‘రామ’మంత్రం. అందుకే రామమంత్రం సర్వశక్తివంతమైన,శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రంగా చెబుతారు.
“రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః
పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ “
నోరు తెరిచి “రా” అని చెప్పినప్పుడే పాపాలు నోటిద్వారా బయటకు పోయి.. మళ్లీ లోపలకు ప్రవేశించకుండా “మ”కారం తో నోటిని మూసి బంధించేదని అర్థం. అంటే రామ అని పిలిస్తే సర్వపాపాలు శరీరం నుంచి బయటకు వెళ్లి అంతః శుద్ధి కలిగుతుందని అర్థం.
“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే “
శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ ఉపదేశించిన మంత్రం ఇది. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
‘రామ’ నామం విశిష్ఠత
అష్టాక్షరీ, పంచాక్షరీ మంత్రాల సారం అయిన రామశబ్ధం శివకేశవుల అభేదాన్ని సూచిస్తుంది. శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడం, శివుడు రామ మహిమ తెలిసిన వానిగా చెప్పబటం ఇందుకు ఉదాహరణ. శ్రీరామచంద్రునికి నమ్మిన బంటు అయిన ఆంజనేయుడు ఈశ్వరాంశతో పుట్టినవాడు కావడం విశేషం. రామనామ పారాయణ జరిగేచోట అన్న వస్త్రాలకు కొదవ ఉండదు. మనుషులు సుఖ శాంతులతో జీవిస్తారు. అందుకే రామనామ సప్తాహాలను, రామ కోటి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మనసులో ఉన్న వికారాలన్నీ తొలగించి, ఐహిక భోగభాగ్యాలు, సుఖాలపై నుంచి మనసును మరలింపజేసేదీ, జీవిత పరమార్థాన్ని బోధించేది రామనామమే. అందుకే రామ నామ సంకీర్తనం మన పెద్దలు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారు.
శ్రీ రఘురామ, చారు తులసీ దళధామ, శమక్షమాది శృం
గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ; జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
మంగళకరమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించి తులసి మాలలు ధరించిన,శమ క్షమాది శృంగార గుణములు తాల్చి… రాక్షసుల సంహరించి లోకాలను కాపాడిన రామా…నీకు మంగళం, మా పాపాలు హరింపజేయి..
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం