ఆలయానికి వెళ్లినా, ఇంట్లో నిత్యదీపారాధన చేసినా కామన్ గా సమర్పించే నైవేద్యం ఏంటంటే.. కొబ్బరికాయ, అరటి పండ్లు..ఇవి కూడా లేకపోతే బెల్లం, పంచదార, పాలు..అయితే ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యం ఒక్కోటి ఉందంటారు పండితులు.
అసలు నైవేద్య సమర్పణ ఎందుకు!
భగవంతుడు తినడు అని తెలిసినా నైవేద్యం ఎందుకు పెడతారనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. తినడు అన్నది నిజమే కానీ.. పూజించేవారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతాభావాన్ని సూచిస్తుంది నైవేద్యం. లోకంలో మనిషి బతకడానికి భుజించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే. ప్రకృతిని సృష్టించి చల్లగా కాపాడుతున్నందుకు ఆ దేవుడికి ఈ జీవుడు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్యం. మనిషి జీవితం త్యాగ భావనలతోనే పరిపూర్ణమవుతుందనే సత్యాన్ని నివేదన చెబుతుంది. తాను అనుభవించడంకన్నా ఇతరులకు పంచడంలోనే ఆనందం ఉందని చాటిచెబుతుంది నైవేద్యం.
ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి!
వినాయకుడు
బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు
శ్రీ వేంకటేశ్వరస్వామి
తులసిమాల మెడలో వేసి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి
లక్ష్మీదేవి
క్షీరాన్నం, పండ్లు పెట్టి తామరపూలతో పూజించాలి
సత్యనారాయణస్వామి
ఎర్ర గోధుమనూక, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి, పంచదార కలిపిన ప్రసాదం నైవేద్యం పెట్టాలి. కదంబ పూలమాల స్వామికి ప్రీతి.
హనుమంతుడు
అప్పాలంటే ఏంతో ఇష్టం అందుకే ఆంజనేయుడికి అప్పాల మాల వేస్తారు. సింధూరం, తమలపాకులతో పూజిస్తారు
లలితాదేవి
క్షీరాన్నం, పండ్లు, పులిహోర, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యం ప్రీతి. అన్ని రకాల పూలు కలపిన మాల అమ్మవారికి వేయాలి
దుర్గాదేవి
మినపగారెలు నైవేద్యంగా సమర్పించి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిది
సంతోషిమాత
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పించాలి
సాయిబాబా
పాలుకోవా, గోధుమరొట్టెలు నైవేద్యం పెట్టాలి
శ్రీకృష్ణుడు
అటుకులతో చేసిన తీపిపదార్ధాలు, వెన్న సమర్పించి తులసీ దళాలతో పూజిస్తే మంచిది
శివుడు
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి
సూర్యుడు
మొక్కపెసలు, క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి జిల్లేడు పూలతో పూజ చేయాలి
ప్రసాదానికి అంత రుచి ఎందుకంటే!
ఏ విధమైన పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూట గడవని నిరుపేద నుంచి కోట్లకు పడగెత్తిన వారి వరకూ ఎవరి శక్తికి తగ్గా నైవేద్యం వారు సమర్పించుకుంటారు. భగవంతుడికి మాత్రం అందరూ సమానులే. భక్తితో ఏమిచ్చినా తీసుకుంటాడనేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. వాస్తవానికి భగవంతుడి దృష్టి ప్రసరించిన ప్రతి పదార్థం అమృతమయమై, శరీరంలో తేజస్సును- ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుందని ప్రాచీనగ్రంథాలు చెబుతున్నాయి. అందుకే భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ పదార్థానికున్న రుచి పెరుగుతుంది. మీరు ఈ విషయం గమనించే ఉంటారు..నిత్యం ఇంట్లో పులిహోర, పొంగలి, దద్ద్యోజనం చేసుకుంటే రాని రుచి..ఆలయంలో నైవేద్యం పెట్టిన తర్వాత ఇచ్చే ప్రసాదానికి ఉంటుంది. అదే మరి భగవంతుడి గొప్పతనం. భగవంతుడి చూపు ప్రసరించిన ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయుష్షు పెరుగుతుందంటారు పండితులు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.