తమిళనాడులో బీజేపీ పుంజుకుంటోంది. నిజానికి తమిళనాడు అంటే కొన్ని ప్రత్యేమైన భావజాలాలు ఉండే రాష్ట్రం. అక్కడ బీజేపీ నిలదొక్కుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. కానీ మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆ పార్టీ రాత మారిపోయింది. ప్రజల్లో క్రేజ్ పెరిగింది. అక్కడ అన్నామలై పార్టీని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఏపీలో మరో అన్నామలై ఎందుకు ఎదగలేకపోతున్నారు. అసలు లోపం ఎక్కడ ఉంది ?
యువకులకు చాన్సిచ్చిన హైకమాండ్
అన్నామలై.. మాజీ ఐపీఎస్ అధికారి, సర్వీసులో ఉన్నప్పుడు ఆయన కర్ణాటకలో పని చేశారు. తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వెంటనే సర్వీసులు వదిలేశారు. ఆయనపై హైకమాండ్ నమ్మకం పెట్టుకుంది. అందుకే అవకాశం ఇచ్చింది. యువకుడిగా చురుగ్గా ఉండే అన్నామలై పార్టీ విధానాలకు అనుగుణంగా అవకాశాలు సృష్టించుకుని ముందుకు దూసుకెళ్లారు. కానీ ఏపీకి వచ్చే సరికి బీజేపీ హైకమాండ్ అనుభవం పేరుతో సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రం అంతా విస్తృృతంగా తిరుగుతూ కష్టపడే యువనేతలకు ఆ బాధ్యతలిస్తే.. డిఫరెన్స్ చూపిస్తారన్న సంగతిని పట్టించుకోలేకపోతున్నారు.
ఏపీ బీజేపీలో చురుగ్గా ఉన్న యువనేతల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారా ?
ఏపీ బీజేపీలో ఫైర్ ఉన్న యువనేతలకు కొదవ లేదు. పూర్తిగా బీజేపీ భావజాలంతో … విద్యార్థి దశ నుంచి ఎదిగిన నేతలు ఉన్నారు. ఏబీవీపీ నుంచి బీజేవైఎం బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయి బీజేపీలో చురుకైన యువనేతగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డి, పీవీ చలపతిరావు వారుసడిగా రంగంలోకి వచ్చిన పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు యువనేతలు ఉన్నారు. అయితే.. ఈ యువనేతలకు రాష్ట్ర స్థాయి పగ్గాలిస్తే.. తమలోఉన్న కసిని చూపించి ఉండేవారన్న అభిప్రాయం ఉంది. కారణం ఏదైనా హైకమాండ్ మాత్రం ఇతర రాష్ట్రాల్లో యువకులకు చాన్సిస్తోంది కానీ..ఏపీ విషయంలో మాత్రం అంత చొరవ తీసుకోలేకపోతోంది.
యువనేతలపై బీజేపీ హైకమాండ్ నమ్మకం ఉంచితేనే బీజేపీకి భవిష్యత్
కింది స్థాయి నుంచి ఎదిగిన నేతలు… తమను తాము నిరూపించుకున్న నేతలకు అవకాశాలు కల్పిస్తే వారు.. పార్టీని ఎలా అభివృద్ధి చేయగలరో చేసి చూపిస్తారు. రాజకీయాల్లోకి ఊడిపడి.. పదవులు తెచ్చుకుని పెద్దగా ప్రజా జీవితంలో లేని వారు… పార్టీని వృద్ధి చేయలేరు. కింది స్థాయి నంచి ఎదిగిన వారే అసలైన నాయకులు అవుతారు. ఏపీ బీజేపీలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి వారిని ఈ కేటగరి కింద తీసుకుని హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందన్నభావన వ్యక్తమవుతోంది.