ఆకాశంలోంచి ఐస్ ముక్కలు ఎందుకు పడతాయి, ఇంతకీ వడగళ్లు తినొచ్చా!

ఆకాశంలోంచి ఐస్ ముక్కలేంటి అని కన్ఫ్యూజ్ అవొద్దు అవే వడగళ్లు. అసలు వర్షం కురిసేటప్పుడు వడగళ్లు ఎందుకు పడతాయి. ఇంతకీ మేఘంలో మంచుముక్కలు ఎలా ఏర్పడతాయంటే..

మేఘాల్లో తేమ మంచు ముక్కలుగా మారుతుంది
వడగళ్లు పడేందుకు క్యుములోనింబస్ మేఘాలు ప్రధాన కారణం. భూమి ఎక్కువగా వేడెక్కి ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు. అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి.
అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. అవే వడగళ్లు. వడగళ్లు మొదట ఎలా మేఘం నుంచి ప్రారంభమయ్యాయో అలాగే భూమిని చేరవు. వాతావరణంలోని వేడి వాటికి జత కావడంతో వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. మేఘాల నుంచి వడగళ్లు పడే వేగం ఎంతో తెలుసుకోవడం చాలా కష్టం. అవి దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయని ఒక అంచనా. అందుకే వడగళ్లు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.

ప్రతిసారీ వడగళ్లు ఎందుకు పడవు
మరి వానపడిన ప్రతీసారీ వడగళ్లు ఎందుకు కురవవు అంటే…ఏ వానైనా మేఘం నుంచి కురిసేదే. అలాగే క్యుములోనింబస్ మేఘాల వల్ల సాధారణంగా వడగళ్ల వానలు పడతాయి. అయితే ఆ మేఘాలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టి ముక్కలుగా విడిపోయి భూమిని చేరేలోపు వాతావరణంలోని వేడి వల్ల వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. అందుకే సాధారణ వర్షాలు కురిసేటప్పుడు వడగళ్లు కనిపించవు. మేఘాల్లో మంచు బిందువుల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి ముక్కలుగా విడిపోయినప్పుడు కూడా భారీ సైజులోనే విడిపోతాయి. అవి నేలకు చేరుకునే సమయంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత, గాలి రాపిడికి కొంత కరిగిపోయినా కూడా మిగతావి నేలపై పడతాయి.

వడగళ్లు తినొద్దు
వడగళ్లవానలు పడేటప్పుడు కొందరు ఆ మంచు ముక్కల్ని తింటారు. పిల్లలైతే సరాదాగా ఏరుకుని మరీ తింటారు. కానీ అలా తినడం మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. వడగళ్లు తింటే మంచిదని పూర్వం పెద్దోళ్లు చెప్పేవారు. కానీ ఇప్పుడు వాతావరణంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది.ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అయితే వడగళ్లు తిననే తినకూడదంటారు. పైగా వడగళ్ల వాన కురిసేటప్పుడు బయట ఉండకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

గమనిక: పలు పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…