సమ్మర్లో కార్లెందుకు తగలబడతాయి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి!

ఏప్రిల్లోనే ఎండలు మంటపెట్టేస్తే మేలో తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోగలమా. వామ్మో..బయటకు రావాలంటేనే భయం. ఎంచక్కా కార్లో ఏసీ వేసుకుని వెళ్లిపోవచ్చులే అనుకుంటే..అందులోనూ రిస్క్ ఉందడోయ్. కారు కొనుక్కోవడం కాదు..దాన్ని సరిగ్గా మెంటైన్ చేయగలగాలి.. సీజన్ బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి…లేదంటే నిత్యం వార్తల్లో చూస్తున్నాం కదా..కారులో మంటలు అనే వార్తలు..అలాగే ఉంటుంది పరిస్థితి. ఇంతకీ సమ్మర్లో కార్లెందుకు తగలబడతాయి..ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రమాదాలను నివారించవచ్చు…

ఎండలకు బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది
సూర్యుడి నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీలు కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే కారు బ్యాటరీలను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి వేసవిలో వారానికి ఒకసారైనా బ్యాటరీని చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్యారేజ్ పార్కింగ్ సౌకర్యం లేని వారు, ముఖ్యంగా ఎండలో పార్కింగ్ చేసేవారు ఈ విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అధిక వేడి వలన కారు బ్యాటరీలోని ద్రవాలు ఆవిరై, బ్యాటరీ లోపలి నిర్మాణం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకూ నీడలో పార్క్ చేయాలి. ద్రవాలు ఆవిరైపోయినట్లుగా అనిపిస్తే వాటిని ఎప్పటికప్పుడు టాప్అప్ చేసుకోవాలి. క్లాంప్‌లను తొలగించి పాత గ్రీజ్‌ను, మురికిని శుభ్రం చేసి, కొత్త గ్రీజ్ రాయాలి. మురికిగా ఉండే బ్యాటరీ ఛార్జ్‌ను బలహీనం చేస్తుంది. ఎలక్ట్రికల్ సిస్టమ్ కరెక్ట్ రేట్ వద్ద చార్జింగ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అండర్‌చార్జింగ్ కన్నా ఓవర్‌చార్జింగ్ వల్లనే బ్యాటరీ త్వరగా డ్యామేజ్ అవుతుంది.

కూలింగ్ సిస్టం
శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచేందుకు చెమట పట్టే వ్యవస్థలానే కారు ఇంజిన్‌లో కూలింగ్ సిస్టం ఉంటుంది. ఇందులో ప్రధానమైనది కూలెంట్. బానెట్​లో కూలెంట్ అనేది చాలా ప్రధానమైనది. కూలెంట్ కారులో ఉన్నప్పుడు ఇంజిన్ చల్లగా ఉంటుంది. అది లేకుంటే ఇంజిన్ వేడిగా అయి రాపిడి ఎక్కువై మంటలు చెలరేగే అవకాశముంటుంది. కూలెంట్ వాటర్ లెవల్ తగ్గితే ఇంజన్ ఓవర్ హీట్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయాణం ప్రారంభించే ముందు కూలెంట్ లెవల్‌ను సరిచూసుకోవాలి. అదే సమయంలో, ఇంజిన్‌లో రేడియేటర్ చుట్టూ ఉండే వివిధ రకాల పైపుల నుంచి లీకేజీ లేకుండా చూసుకోవాలి. లీకేజీ ఉంటే వెంటనే సరిచేయించాలి.

టైరులో గాలి చాలా ముఖ్యం
సాధారణంగా మైలేజీ ఎక్కువ వస్తుందన్న భావనతో నిర్ణీత పరిమాణం కంటే కొందరు ఎక్కువగా గాలి నింపుతారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం.
వాహనం టైర్లలో సూచించిన పరిమాణంలోనే గాలి నింపాలి. సాధారణంగా డ్రైవర్ సీటులో కుడి వైపు డోరుకు ఆ వాహనం టైర్లలో ఎంత మేరకు గాలిని నింపాలన్న స్టిక్కర్ అతికించి ఉంటుంది. దాని ప్రకారంమాత్రమే గాలి నింపాలి. ఎండాకాలంలో తారు రోడ్డుపై ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దానిపై వాహనం ప్రయాణించే సమయంలో టైర్లలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాహనం హైస్పీడ్‌లో ఉన్నప్పుడు గాలి ఎక్కువగా ఉంటే టైర్ పేలిపోయో ప్రమాదం ఉంది…లేదంటే..రన్నింగ్ లో అదుపుతప్పితే పల్టీలు కొట్టి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది

షార్ట్ సర్యూట్ జరగకుండా ఉండాలంటే
కొన్ని పార్కింగ్ ఏరియాల్లో బండి పెట్టడం వల్ల ఎలుకల బెడద ఉన్నట్టైతే అవి లోపలకు వెళ్లి వైర్లు కొరికేసే ప్రమాదం ఉంది. వైర్లు తెగిపోయి కారు బాడీకి తగిలి పొగలు వస్తాయి. ఈ విషయం గమనించకపోతే మంటలు చెలరేగుతాయి. అందుకే గుడ్డిగా కారు తీయడం కాదు..ఈ విషయంకూడా జాగ్రత్తగా కమనించుకోవాలి.

వాహనానికి విశ్రాంతి
దూరప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కారుకి కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాలి. వాహనమే కదా దానికి అలసట ఏంటి అనుకోకూడదు..ఇంజిన్ మరీ వేడెక్కక ముందే అప్రమత్తంగా ఉండడం మంచిది. కనీసం పది నిముషాలైనా వాహనానికి మధ్యలో విశ్రాంతి ఉండాలి

ఇంజిన్ ఆయిల్ చూసుకోవాలి
బానెట్​లో ఇంజిన్​ ఆయిల్​, కూలెట్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్​ చేసుకోవాలి. వైర్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తరచూ వీటిని చెక్​ చేసుకుంటూ ఉండాలి. ఆ తరువాతే బయటకు వెళ్లాలి….