కాకినాడ లోక్‌సభ స్థానం రాష్ట్రంలో కీలకంగా మారింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం దీని పరిధిలోనే ఉండడం ఒక కారణమైతే, రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో ఇదొక్కటి కావడం మరో కారణం. వీటితోపాటు ఇప్పటికే వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ నాలుగోసారి బరిలో ఉండడం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సాధారణ ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు చుట్టూ ఆసక్తికరంగా రాజకీయాలు కనిపిస్తున్నాయి.
సునీల్ సత్తా చాటుతారా ?
ఇప్పటికే మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున బరిలోకి దిగి మూడు దఫాలు ఓటమి చవిచూసిన సునీల్ ఈసారి గట్టెక్కాలని ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎలాగైనా ఈసారి గెలుపొంది తీరాలనే ఆకాంక్షతో పని చేసుకుంటున్నారు. 2014లో తాను పోటీ చేసిన వైసిపి నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఒకసారి ఓటమి పాలైన పార్టీ తరపున రెండోసారి పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఎన్నికల్లో అవకాశాలు కలిసి వస్తాయని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సానుభూతి కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే అధికార వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థుల పనితీరును బట్టే ఎంపీ విజయవకాశాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు.
కూటమి బలంపైనే తంగెళ్ల ఆశలు
జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్థానికేతరుడు అనే అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేందుకు వైసిపి తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ ఏడాది కాలంగా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై దృష్టి పెట్టి పని చేస్తున్నారు. అయితే అనూహ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ తెరమీదకు రావడంతో కాకినాడ పార్లమెంటు సీటుకి పోటీ చేయాల్సి వస్తుంది. ఈ పార్లమెంటు పరిధిలో ఆయనకు పరిచయాలు తక్కువగా ఉండడం, ఉదయ్ పేరు కూడా పెద్దగా వినని దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్నిచోట్ల టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థులు కూడా ప్రచారంలో వెనుకబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీంతో ఆయా ప్రచార వ్యవహారాలకు పదును పెట్టి మరింత ముందుకు దూసుకువెళ్లేందుకు శ్రీనివాస్ ఏ విధంగా ప్రయత్నం చేస్తారు..? ఆయన వ్యూహాలు ఏరకంగా పనిచేస్తాయనేది చూడాల్సివుంది.
అధికారికంగా ప్రకటించని పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ బరిలో ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన గెలుపు అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆ పార్టీ శ్రేణులు అంచనాలు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి సీటును ఆశించిన సానా సతీష్‌బాబు తన ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సతీష్ బాబు జనసేన నుంచి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దాంతో ఉదరు శ్రీనివాస్ కాకుండా జనసేన తరపున సతీష్ బాబు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.