“రాయల తెలంగాణ ” నినాదం ఎవరి స్కెచ్ ?

రాయలసీమన తెలంగాణలో కలపాలని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అలా చేస్తేనే రాయలసీమ నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడం కష్టంకానీ కలపడం కష్టమని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఇలా రాయలసీమను తెలంగాణలో కలపాలంటే.. ముందు ఏపీ నుంచి విడగొట్టాలి కదా అన్న లాజిక్ ఆయన మిస్సవుతున్నరు. రాయల తెలంగాణ డిమాండ్ కు మొదట్లోనే కొంత మంది రాయలసీమ నేతలు సపోర్ట్ చేశారు. జేసీ బ్రదర్స్ తో పాటు టీజీ వెంకటేష్ లాంటి వాళ్లు కూడా మద్దతు పలికారు. దాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇప్పుడు కొంత మంది ప్రత్యేక రాయలసీమ అంటున్నారని వస్తే మంచిదేనని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పుడెందుకు రాయల తెలంగాణ ?

రాయల తెలంగాణ.. అప్పుడెప్పుడో పదేండ్ల కింద రాష్ట్ర విభజనకు ముందు వినిపించిన నినాదం. తెలంగాణలో అప్పటి పది జిల్లాలకు తోడుగా రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్‌, జేసీ దివాకర్‌రెడ్డి వంటి సీమ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా అప్పట్లో జై కొట్టారు. తెలంగాణ రాష్ట్ర విభజన అనివార్యమైతే.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఎంఐఎం శ్రీకృష్ణ కమిటీకి తన నివేదిక ఇచ్చింది. అది అసాధ్యమని తర్వాత తేల్చేశారు. అసలు ఇప్పుడెందుకు రాయల తెలంగాణ అంటున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక సీమ కోసమే ఎక్కువ మంది డిమాండ్

న్నేళ్లుగా రాయల సీమ హక్కుల పేరిట ఉద్యమం చేస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమను విడదీసే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు.గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నది ఆయన డిమాండ్. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా రాయలసీమలో కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చెయ్యాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. ఏపీతో కలిసి ఉండటం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మా నీళ్లు-మా నిధులు అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం బైరెడ్డి గళం విప్పుతున్నారు. ఆయన గతంలో రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి ప్రజలు పట్టించుకోవడం లేదని మూసేశారు.

రాజకీయం ప్రారంభించిన తెలంగాణ నేతలు !

ఇలా జేసీ రాయల తెలంగాణ అనగానే.. అలా తెలంగాణ నేతలు రాజకీయం ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాయల తెలంగాణ వాదం తెరపైకొస్తోందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ రెండూ సాధ్యం కాని విషయాలని కేసీఆర్ నాయకత్వంలోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం ప్రజలు మర్చిపోయిన అంశాలను అప్పుడప్పుడు తీసుకురావడం వాళ్లకు కామన్‌గా మారిపోయిందని మరికొంత మంది వైసీపీ నేతలంటున్నారు.

వచ్చే ఎన్నికల తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పెరుగుతుందా ?

వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగూ ప్రత్యేక రాయలసీమ పేరుతో ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. కర్నూలు న్యాయ రాజధాని పేరుతో ప్రజల్ని ఇప్పటికే ప్రజల్లోకి పంపేశారు. బళ్లారి ప్రాంతాలను కలుపుకుని రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేయడానికి కొంత మంది గతంలోనే ప్రణాళికలుసిద్ధం చేశారని అంటున్నారు. అటువంటి వారికి జేసీ మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు రాయల తెలంగాణ అన్నా.. ప్రత్యేక సీమ అన్నా.. గ్రేటర్ సీమ అన్నా.. ఇక్కడితో ఆగేది కాదని ముందు ముందు చాలా సినిమాఉంటుందని అంటున్నారు.