ఎత్తైన పర్వతాలు , పచ్చని ప్రకృతిమధ్య కొలువుతీరిన పార్వతీ తనయుడు!

సిక్కింలో అత్యంత అందమైన దేవాలయాల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది శ్రీ విశ్వ వినాయక మందిరం. ఓ కొండపై ఉన్న ఈ అందమైన ఆలయం 2016 సంవత్సరంలో స్థాపించారు. ఇందులో 12 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం ఉంది. ఇది తూర్పు సిక్కిం జిల్లా రెనాక్ రుంగ్‌డంగ్ వద్ద ఉంది. ఈ ఆలయం విశిష్టత ఇదే…

భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటి సిక్కిం. అందమైన హిల్ స్టేషన్లు, పచ్చని పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఇదొక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా వెలుగుతోంది. ఏన్నో చారిత్రక ప్రదేశాలు ఉండడంతో చరిత్ర ప్రియులను కూడా ఆకర్షిస్తోంది. అందుకే సిక్కింను భారతదేశంలో అన్నిరకాల పర్యాటకులకు అంతిమ గమ్యస్థానం అని చెబుతారు. ట్రెక్కింగ్ ట్రయల్స్ నుండి ఆకాశాన్ని తాకే పర్వతాలు మరియు పచ్చని లోయల వరకు మనోహరమైన జలపాతాలు మరియు చారిత్రక స్మారక చిహ్నాల వరకు అందమైన దేవాలయాల వరకు, ఇది మిమ్మల్ని ఆకర్షించే మరియు ఆశ్చర్యపరిచే ప్రతిదీ కలిగి ఉంది. ఇక్కడున్న దేవాలయాలు కూడా ప్రశాంతతకు నిలయం…వీటిలో అత్యంత ప్రముఖ ఆలయం విశ్వ వినాయక మందిరం.

దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన కాంప్లెక్స్‌లో నాలుగు అంతస్తుల ఆలయం 108 అడుగుల ఎత్తులో ఉంది. గతంలో రాధా కృష్ణ మందిరం ఉన్న స్థలంలోనే ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిగా గణేశుడి 51 రూపాలు ఉన్నాయి. నిర్మాణ సామగ్రిని థాయిలాండ్ నుంటి దిగుమతి చేసుకున్నారు…నేపాల్ , పశ్చిమ బెంగాల్ నుంచి నిపుణులైన చేతివృత్తులవారిని నిర్మాణం కోసం తీసుకొచ్చారు. ప్రధాన బలిపీఠంలో 16 చేతులతో 12 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం ఉంది. 2008లో పునాది వేసిన ఈ ఆలయం 2016లో పూర్తైంది. ఇక్కడ శిల్పకళ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా క్షీరసాగరమథనం ఘట్టం అందమైన విగ్రరూపంలో భక్తులను ఆకట్టుకుంటుంది. రాక్షసుల బారినుంచి దేవతలను రక్షించేందుకు మంధరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలికిన ఘట్టాన్ని కళ్లకు కట్టేలా వివరిస్తుంది.

సాధారణంగా వినాయకుడిని విఘ్నాధిపతిగా చెప్పుకుంటారు…చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురుకారాదు అంటూ ముందుగా వినాయకుడిని ప్రార్థిస్తారు. అయితే విశ్వ వినాయక మందిరాన్ని దర్శించుకునే భక్తులకు ఎంత కష్టమైన పని అయినా విజయవంతం అవుతుందని నమ్మకం..

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..